నీలాంటి ఎందరినో మట్టి కరిపించినం .. సీఎం రేవంత్​పై కేటీఆర్​ ఫైర్​

నీలాంటి ఎందరినో మట్టి కరిపించినం ..  సీఎం రేవంత్​పై కేటీఆర్​ ఫైర్​
  • తెలంగాణ జెండాను ఎందుకు బొందపెడ్తవ్​?
  • తెలంగాణ తెచ్చినందుకా..  డెవలప్ చేసినందుకా?
  • బొందపెట్టుడు తర్వాత.. ముందు హామీలు నెరవేర్చు
  • హామీలపై తప్పించుకోవాలని చూస్తే వదిలిపెట్టం
  • కరెంట్​ బిల్లులు కట్టొద్దు.. వాటిని సోనియాకు పంపాలి
  • బీఆర్ఎస్​కు బీజేపీతో పొత్తు ఉండబోదని ప్రకటన
  • కాంగ్రెస్​కు రేవంత్​ ఏక్​నాథ్ ​షిండేలా మారుతారని ఆరోపణ

హైదరాబాద్, వెలుగు: బీఆర్ఎస్ ​ప్రస్థానంలో రేవంత్​రెడ్డి లాంటి వాళ్లను ఎంతో మందిని చూశామని ఆ పార్టీ వర్కింగ్​ ప్రెసిడెంట్​ కేటీఆర్​ అన్నారు. ‘‘రేవంత్​రెడ్డిలా అహంకారంతో మాట్లాడిన నాయకులను ఎంతో మందిని చూసినం. బీఆర్ఎస్​ను వంద మీటర్ల లోపల బొందపెట్టే సంగతి తర్వాత.. ముందు హామీలను వంద రోజుల్లో నెరవేర్చడంపై దృష్టి పెట్టాలి” అని వ్యాఖ్యానించారు. శనివారం తెలంగాణ భవన్​లో నిర్వహించిన సికింద్రాబాద్, హైదరాబాద్​ లోక్​సభ నియోజకవర్గాల సన్నాహక సమావేశంలో కేటీఆర్​ మాట్లాడారు. ‘‘రేవంత్​ లెక్కనే ఎందరో మఖలో పుట్టి పుబ్బలో పోతదని బీఆర్​ఎస్​పై నీలిగిండ్రు.. రెండున్నర దశాబ్దాలుగా పార్టీ నిలబడి అలాంటి ఎందరినో మట్టి కరిపించింది” అని ఆయన అన్నారు. 

‘‘తెలంగాణ జెండాను ఎందుకు బొందపెడ్తవ్​? .. తెలంగాణ తెచ్చినందుకా.. తెలంగాణను డెవలప్ చేసినందుకా.. మిమ్మల్ని, మీ దొంగ హమీలను ప్రశ్నిస్తునందుకా? పార్లమెంట్ ఎన్నికల తర్వాత కాంగ్రెస్, బీజేపీ కలిసిపోతయ్​.. రేవంత్ కాంగ్రెస్​కు ఏక్ నాథ్ షిండేగా మారతడు.. రేవంత్ రక్తం బీజేపీదే.. ఇక్కడ చోటా మోదీగా రేవంత్ రెడ్డి మారిండు.. గతంలో అదానీ గురించి అడ్డగోలుగా మాట్లాడిన రేవంత్ ఇప్పుడు అదానీతో అలయ్​బలయ్​ చేసుకున్నడు.. అదానీ, రేవంత్ రెడ్డి ఒప్పందాల లోగుట్టు బయటపెట్టాలి..” అని కేటీఆర్​ పేర్కొన్నారు. డబుల్ ఇంజన్ అంటే అదానీ, ప్రధాని అని గతంతో చెప్పిన రేవంత్ ఇప్పుడు ట్రిపుల్ ఇంజన్​గా మారారని విమర్శించారు. 

కరెంట్​ బిల్లులు కట్టొద్దు

రాష్ట్ర ప్రజలు జనవరి నెల కరెంట్​ బిల్లులు కట్టొద్దని, ఉచిత కరెంట్​ఇస్తామన్న కాంగ్రెస్ ​హామీని నెరవేర్చే వరకు బిల్లులు కట్టొద్దని కేటీఆర్​ అన్నారు. ‘‘బిల్లుల వసూళ్ల కోసం వచ్చే అధికారులకు ఎన్నికలకు ముందు రేవంత్ ​మాట్లాడిన వీడియోలు చూపించాలి.  ప్రతి ఇంటికి వస్తున్న కరెంట్ ​బిల్లుల కాపీలను సోనియా గాంధీ నివాసం 10 జన్​పథ్​కు పంపాలి” అని పేర్కొన్నారు. హైదరాబాద్​లోని ప్రతి మీటర్​కు గృహజ్యోతి పథకం కింద ఉచిత కరెంట్​ఇవ్వాలని డిమాండ్​ చేశారు. కిరాయి ఇండ్లలో ఉండేవాళ్లకు ఈ సదుపాయం కల్పించాలన్నారు. మహాలక్ష్మీ పథకంలో భాగంగా ప్రతి మహిళలకు నెలకు రూ.2,500 వెంటనే ఇవ్వాలని డిమాండ్​ చేశారు. ఆరు గ్యారంటీల హామీల అమలు నుంచి తప్పించుకోవాలని చూస్తే వదిలిపెట్టేది లేదని కేటీఆర్​ హెచ్చరించారు. బీజేపీతో తాము ఇప్పటి వరకు పొత్తు పెట్టుకోలేదని, భవిష్యత్​లోనూ ఉండబోదన్నారు. 

సికింద్రాబాద్​కు కిషన్​రెడ్డి ఏం చేశారు?

ఎంపీగా, కేంద్ర మంత్రిగా సికింద్రాబాద్​ లోక్​సభ నియోజకవర్గానికి ఐదేండ్లలో కిషన్​రెడ్డి ఏం చేశారని కేటీఆర్​ ప్రశ్నించారు. ‘‘కేసీఆర్ ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్​ ఇరిగేషన్​ ప్రాజెక్టు కడితే సీతాఫల్ ​మండి రైల్వే స్టేషన్​లో ప్యాసింజర్​ లిఫ్టులను కేంద్ర మంత్రి జాతికి అంకితం చేశారు.  ఆయన చేసిన అతిపెద్ద పని అది మాత్రమే. బీఆర్ఎస్ ​ప్రభుత్వం 36 ఫ్లై ఓవర్లు కడితే.. కేంద్రం ఉప్పల్, అంబర్​పేట ఫ్లై ఓవర్లను కట్టలేక చేతులెత్తేసింది. హైదరాబాద్​లో గులాబీ జెండాకు ఎదురులేదు” అని అన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఓడినా ఎప్పటికీ ప్రజల పక్షమేనని కేటీఆర్​ చెప్పారు. కాంగ్రెస్​ 50 రోజుల పాలనలో ఆటోడ్రైవర్లు మొదలు అనేక మంది ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి వచ్చిందన్నారు. రైతుబంధు ఇంతవరకు ఇవ్వలేదని, కాంగ్రెస్ ​హామీల అమలుపై స్పష్టత లేదని దుయ్యబట్టారు. మైనార్టీల సమస్యలపై పది రోజుల్లో తెలంగాణ భవన్​లో సమావేశం నిర్వహిస్తామని కేటీఆర్​ చెప్పారు. రాష్ట్రంలోని మైనార్టీ ముఖ్య నేతలను సమావేశానికి ఆహ్వానించి, అన్ని అంశాలపై చర్చిద్దామని నేతలకు సూచించారు. 

మమ్మల్ని పట్టించుకోలే: కార్యకర్తలు

కేసీఆర్​ పార్టీ పెట్టిన రోజు నుంచి పని చేస్తున్నా తమను కనీసం పట్టించుకోలేదని హైదరాబాద్​కు చెందిన పలువురు కార్యకర్తలు సమావేశంలో ఆవేదన వ్యక్తం చేశారు. గులాబీ జెండా మోసినోళ్లకు గుర్తింపు లేకుండా పోయిందని, వేరే పార్టీల నుంచి వచ్చిన వారికే పదవులు, ప్రాధాన్యం దక్కిందని చెప్పారు. తొమ్మిదిన్నరేండ్లు అధికారంలో ఉన్నా ఏ ఒక్క మంత్రి, ఏ ఒక్క ఎమ్మెల్యే తమకు ప్రాధాన్యం ఇవ్వలేదన్నారు. ‘‘పార్టీ కోసం ఎంతో కష్టపడి పనిచేసిన.  నా ఇల్లు కూడా అమ్ముకున్న. పార్టీ నన్ను ఆదుకోలేదు” అని ఓ మహిళా కార్యకర్త కన్నీళ్లు పెట్టుకున్నారు. ఇకనైనా కేడర్​ను పట్టించుకోవాలని సూచించారు.