బీఆర్ఎస్​ ఎంపీ అభ్యర్థులు ముందే ఫీల్డ్​లోకి!

బీఆర్ఎస్​ ఎంపీ అభ్యర్థులు ముందే ఫీల్డ్​లోకి!

హైదరాబాద్, వెలుగు: లోక్​సభ ఎన్నికల్లో పోటీ చేయనున్న అభ్యర్థులను ముందే ఫీల్డ్​లోకి దించాలని బీఆర్ఎస్​అధిష్టానం నిర్ణయించింది. అభ్యర్థులను మాత్రం ఎన్నికల నోటిఫికేషన్​ తర్వాతే అధికారికంగా ప్రకటించాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. ఎంపీ అభ్యర్థుల ఎంపికపై బుధవారం ఎర్రవెల్లి ఫామ్​హౌస్​లో పార్టీ చీఫ్​కేసీఆర్​తో కేటీఆర్, హరీశ్​రావు సమావేశమయ్యారు. ఇప్పటికే కరీంనగర్, చేవెళ్ల, ఖమ్మం, జహీరాబాద్​నుంచి పోటీ చేసే అభ్యర్థులపై అధిష్టానం స్పష్టత ఇచ్చింది. కరీంనగర్​ఎంపీగా తనను గెలిపించాలని కోరుతూ వినోద్​కుమార్​ఇప్పటికే ప్రచారం షురూ చేశారు. మిగతా ముగ్గురు సిట్టింగ్​ఎంపీలు కావడంతో పార్లమెంట్​బడ్జెట్​సెషన్​తర్వాత వాళ్లు ఫీల్డ్​లోకి దిగుతారని చెబుతున్నారు.

బీఆర్ఎస్​సిట్టింగ్​ఎంపీల్లో ఒకరిద్దరు కాంగ్రెస్​వైపు, మరికొందరు బీజేపీ వైపు చూస్తున్నట్టుగా ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో అభ్యర్థుల ఎంపికపై బీఆర్ఎస్ ఆచితూచి వ్యవహరిస్తోంది. ఇతర పార్టీలతో టచ్​లో ఉన్న వారికి బదులుగా బలమైన నేతలను పోటీకి దించాలని యోచిస్తోంది. ఎన్నికల్లో ఖర్చుకు చాలా మంది నేతలు వెనుకాడుతుండడంతో ఆ విషయాన్ని కేసీఆర్ కు కేటీఆర్, హరీశ్ చెప్పారు. కొన్ని నియోజకవర్గాల్లో జిల్లా నేతల నిర్ణయానికి వ్యతిరేకంగా అభ్యర్థులను నిలబెడితే అసెంబ్లీ ఫలితాలే రిపీట్​అవుతాయని, అభ్యర్థుల ఎంపికలో జిల్లా నాయకుల మాటకు విలువ ఇవ్వాలని కోరారు. ఇటీవల నిర్వహించిన లోక్​సభ నియోజకవర్గాల సన్నాహక సమావేశాల్లోనూ క్యాడర్, లీడర్ల నుంచి ఇదే ఫీడ్​బ్యాక్​వచ్చిందని పేర్కొన్నారు. 

ఈ నెల రెండోవారం లోపు ఎంపిక.. 

రాష్ట్రంలో 17 లోక్​సభ సీట్లు ఉండగా, బీఆర్ఎస్​కు 9 మంది ఎంపీలు ఉన్నారు. హైదరాబాద్​లో ఎంఐఎంతో తమది ఫ్రెండ్లీ కంటెస్టేనని బీఆర్ఎస్ ఇప్పటికే క్లారిటీ ఇచ్చింది. ఇది మినహా మిగతా 16 సీట్లకు అభ్యర్థుల ఎంపిక కోసం ముగ్గురు కీలక నేతలు కసరత్తు చేశారు. పార్టీ నుంచి పోటీకి ఆసక్తి చూపిస్తున్న నాయకుల పేర్లను కేసీఆర్ కు వివరించారు. వారిలో ఎవరెవరు ఎప్పటి నుంచి పార్టీలో ఉన్నారు? ఉద్యమకాలం నుంచి పార్టీతో  ఉన్నవాళ్లు ఎవరు? వారిపై కార్యకర్తలు, ప్రజల నుంచి ఎలాంటి ఫీడ్​బ్యాక్ ​ఉంది? ఎవరికి టికెట్​ఇస్తే పార్టీకి లాభం? అనే అంశాలపై చర్చించారు. టికెట్​ఖరారు చేశాక ఎవరైనా హ్యాండ్​ ఇస్తారా? అనే దానిపైనా చర్చించినట్టు తెలుస్తోంది.

అలాంటి నేతలను ముందే గుర్తించి పక్కన పెట్టాలని నిర్ణయించినట్టుగా సమాచారం. ఫిబ్రవరి రెండో వారంలోపు అభ్యర్థుల ఎంపిక పూర్తి చేయాలని, వారిని ఫీల్డ్​ లోకి దించాలని నిర్ణయించినట్టుగా తెలుస్తోంది. రాష్ట్రంలో కాంగ్రెస్​అధికారంలోకి రావడం, అయోధ్య రామాలయం ప్రారంభోత్సవంతో వచ్చే మైలేజీని తమకు అనుకూలంగా మార్చుకోవడానికి బీజేపీ ప్రయత్నిస్తుండడంతో... ఈసారి ఆ రెండు పార్టీల నుంచి గట్టి పోటీ తప్పదని నిర్ధారణకు వచ్చారు. ఈ క్రమంలో కచ్చితంగా గెలిచే సీట్లను చిన్న చిన్న పొరపాట్లతో చేజార్చుకోవద్దని, అభ్యర్థుల ఎంపికే ఇందులో కీలకమని గుర్తించారు. క్యాడర్, లీడర్ల​అభిప్రాయాలకు విలువనిచ్చే అభ్యర్థులను ఎంపిక చేయాలని, అసెంబ్లీ ఎన్నికల నాటి తప్పులకు తావు ఇవ్వొద్దని నిర్ణయానికి వచ్చినట్టుగా తెలుస్తోంది.