ఎన్నికల్లో ప్రతి ఒక్కరికీ ఫోన్, మెసేజ్‌లు చేసేలా బీఆర్ఎస్ ప్లాన్

ఎన్నికల్లో ప్రతి ఒక్కరికీ ఫోన్, మెసేజ్‌లు చేసేలా బీఆర్ఎస్ ప్లాన్
  • లబ్ధిదారుల డేటా తీస్తున్నరు
  • ఎన్నికల్లో ప్రతి ఒక్కరికీ ఫోన్, మెసేజ్‌లు చేసేలా బీఆర్ఎస్ ప్లాన్
  • జిల్లాకో టెలి యూనిట్ ఏర్పాటు! 

హైదరాబాద్, వెలుగు: వివిధ స్కీముల కింద ప్రభుత్వంలో ఉన్న డేటాను ఎన్నికల కోసం వినియోగించుకోవాలని అధికార బీఆర్ఎస్ భావిస్తోంది. లబ్ధిదారుల వివరాలు తీయడంపై దృష్టి పెట్టింది. ఏ స్కీములో ఎంతమంది లబ్ధిదారులు ఉన్నారు? వారి సామాజిక వర్గం ఏమిటి? ఫోన్ నంబర్ ఏంటి? ఏ గ్రామం? ఏ నియోజకవర్గం? వంటి వివరాలతో రిపోర్టులు సిద్ధం చేస్తున్నారు. ఆ సమాచారాన్ని అధికార పార్టీ తరపున పోటీలో ఉండే అభ్యర్థులకు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.

రాష్ట్ర ప్రభుత్వం నుంచి పొందిన లబ్ధిని సాకుగా చూపి.. ప్రజల మైండ్‌‌ను మార్చి ఓట్లు రాల్చుకోవాలని ప్రయత్నాలు మొదలుపెట్టింది. కచ్చితంగా బీఆర్ఎస్‌‌కు ఓటు వేయాలని క్షేత్రస్థాయిలో కేడర్ కోరనున్నది. పార్టీ పెద్దల నుంచి కూడా బెనిఫిషియర్లకు ఫోన్లు చేయించాలని పార్టీ ప్లాన్​చేసింది. జిల్లాకో టెలి యూనిట్ టీమ్‌‌లను ఎన్నికల కోసం ఏర్పాటు చేయనుంది. స్కాలర్​షిప్‌‌ల దగ్గర నుంచి కల్యాణలక్ష్మి, ఆసరా, ఓవర్సీస్ స్కాలర్‌‌‌‌షిప్, ఆరోగ్య శ్రీ, కేసీఆర్ కిట్, న్యూట్రిషన్ కిట్, కార్మికుల సంక్షేమం, రైతుబంధు, రైతుబీమా, గొర్రెల స్కీం, డెయిరీ ఇన్సెంటివ్, దళితబంధు, గురుకులాలు తదితర స్కీమ్​లు లబ్ధిదారులను సర్కార్​నేరుగా ఆశ్రయించనున్నట్లు తెలుస్తోంది.

దీంతోపాటు యువత, నిరుద్యోగులను ఆకర్షించేందుకు ప్రత్యేక ప్రణాళికను రూపొందిస్తున్నట్లు సమాచారం. ప్రతి ఒక్కరినీ కిందిస్థాయి లీడర్లు ప్రత్యక్షంగా కలవడం, ఫోన్‌‌లు, మెసేజ్‌‌లు చేయడమే లక్ష్యంగా వివరాలు సేకరిస్తున్నారు.