బీఆర్‌‌ఎస్‌‌ లీడర్లు, పోలీసుల తోపులాట.. సీఐకి గాయాలు

బీఆర్‌‌ఎస్‌‌ లీడర్లు,  పోలీసుల తోపులాట.. సీఐకి గాయాలు

ఖమ్మం టౌన్, వెలుగు : కేసీఆర్‌‌ను సిట్‌‌ విచారణకు పిలవడాన్ని నిరసిస్తూ ఆదివారం ఖమ్మంలో బీఆర్‌‌ఎస్‌‌ చేపట్టిన ఆందోళన ఉద్రిక్తంగా మారింది. బీఆర్‌‌ఎస్‌‌ నాయకులు, పోలీసుల మధ్య జరిగిన తోపులాటలో సీఐ చేయి విరిగింది. వివరాల్లోకి వెళ్తే... బీఆర్‌‌ఎస్‌‌ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించేందుకు మాత్రమే పోలీసులు పర్మిషన్‌‌ ఇచ్చారు. కానీ ఆ పార్టీ లీడర్లు రాస్తారోకోతో పాటు ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనానికి యత్నించారు. గమనించిన ఖమ్మం వన్‌‌ టౌన్‌‌ సీఐ కరుణాకర్‌‌ అడ్డుకునే ప్రయత్నం చేయడంతో బీఆర్‌‌ఎస్‌‌ కార్యకర్తలు, పోలీసుల మధ్య తోపులాట జరిగింది. ఇదే సమయంలో బీఆర్‌‌ఎస్‌‌ లీడర్లు ప్రభుత్వ దిష్టిబొమ్మపై పెట్రోల్‌‌ పోసి నిప్పంటించడంతో మంటలు సీఐకి అంటుకున్నాయి.

ఓ వైపు మంటలు, మరో వైపు తోపులాట కారణంగా సీఐ కింద పడిపోయారు. గమనించిన పోలీసులు అతడిని హాస్పిటల్‌‌కు తరలించగా.. మణికట్టు వద్ద ఫ్యాక్చర్‌‌ అయినట్లు డాక్టర్లు తెలిపారు. దీంతో బీఆర్‌‌ఎస్‌‌ పట్టణ అధ్యక్షుడు పగడాల నాగరాజుతో పాటు కోయిలపొంగు వెంకట్, ఉపేందర్‌‌ను ఖమ్మం టూ టౌన్‌‌ ఫోలీసులు అరెస్ట్‌‌ చేశారు. మరో ముగ్గురు పరారీలో ఉన్నారని పోలీసులు తెలిపారు.