ముషీరాబాద్, వెలుగు: కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్‌పై నమోదైన పోక్సో కేసును హనీట్రాప్‌గా మార్చి నీరుగార్చేందుకు బీజేపీ, కాంగ్రెస్ కుమ్మక్కయ్యాయని ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ విమర్శించారు. సోమవారం రాంనగర్ చౌరస్తాలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో బండి సంజయ్ దిష్టిబొమ్మను దహనం చేసి భారీ రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బాధిత బాలికకు న్యాయం జరగాలంటే బండి సంజయ్‌ను కేంద్ర మంత్రి పదవి నుంచి వెంటనే బర్తరఫ్ చేసి, భగీరథ్‌ను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు.
ఉప్పల్: భగీరథ్‌ను అరెస్ట్ చేయకపోవడం వెనుక సీఎం రేవంత్ రెడ్డి సహకారం ఉందని ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి ఆరోపించారు. సోమవారం చిల్కానగర్లోని బీఆర్ఎస్ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. ‘‘మోదీ బేటీ బచావో అంటే.. సంజయ్ బేటా బచావో’’ అన్న చందంగా బీజేపీ వ్యవహరిస్తోందని ఎద్దేవా చేశారు. రాష్ట్ర హోంశాఖ బాధ్యతలు నిర్వహిస్తున్న సీఎం, కేంద్ర మంత్రితో కుమ్మక్కై కేసును నీరుగారుస్తున్నారని, పేదలకు ఒక న్యాయం, పెద్దలకు ఒక న్యాయమా అని ప్రశ్నించారు. తక్షణమే నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని, లేనిపక్షంలో బీఆర్ఎస్ తరఫున పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని హెచ్చరించారు.
పద్మారావునగర్: మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడినట్లు వస్తున్న ఆరోపణల నేపథ్యంలో విచారణ పారదర్శకంగా జరగాలంటే బండి సంజయ్ తన ఎంపీ, మంత్రి పదవులకు రాజీనామా చేయాలని రాష్ట్ర క్రైస్తవ మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ దీపక్ జాన్ డిమాండ్ చేశారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. దేశం, ధర్మం అని ప్రగల్భాలు పలికే బీజేపీ నాయకులు, తమ సొంత పార్టీ నేత కుమారుడు నిందితుడు కావడంతో మౌనం పాటిస్తున్నారని మండిపడ్డారు. మేడ్చల్, గచ్చిబౌలిలోనూ ఆందోళనలు కొనసాగాయి.
