కాంగ్రెస్ కు ఆరు గ్యారంటీలు, 420 హామీల పేరుతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ.. తెలంగాణ ప్రజలను దారుణంగా దగా చేసిందని మాజీ మంత్రి హరీశ్ రావు మండిపడ్డారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హయాంలో వెయ్యి రోజుల పాలన రాష్ట్ర ప్రజల పాలిట శాపంగా మారిందని, అన్ని రంగాల్లో రాష్ట్రాన్ని కుదేలు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులు, నిరుద్యోగులు, మహిళలను మోసం చేసిన ప్రభుత్వ వైఫల్యాలను ప్రతి గడపకూ తీసుకెళ్లి ఎండగట్టాలని పిలుపునిచ్చారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలులో విఫలమైన తీరును ఎండగట్టేందుకు హరీశ్ రావు ఉమ్మడి మెదక్ జిల్లా ముఖ్య నాయకులతో కీలక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ శ్రేణులకు హరీశ్ రావు దిశానిర్దేశం చేశారు. అనంతరం మాట్లాడిన ఆయన.. కేసీఆర్ హయాంలో జరిగిన అభివృద్ధిని, నేడు కాంగ్రెస్ పాలనలో జరుగుతున్న విధ్వంసాన్ని ప్రజలకు వివరించాలని నేతలకు సూచించారు. గ్రామ, మండల, నియోజకవర్గ స్థాయిలో శ్రేణులంతా సైనికుల్లా పనిచేయాలని, కాంగ్రెస్ నాయకులు ఊళ్లలోకి వస్తే ఎన్నికల హామీల కార్డులతో ఎక్కడికక్కడ నిలదీయాలని కోరారు. సోషల్ మీడియాను సైతం జోరుగా వినియోగించి ప్రభుత్వ మోసాలను ఇంటింటికీ చేరవేయాలన్నారు. పార్టీ పిలుపు మేరకు ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా వారం రోజుల పాటు భారీ నిరసన కార్యక్రమాలను చేపట్టి కాంగ్రెస్ ప్రభుత్వ మెడలు వంచాలని హరీశ్ రావు బీఆర్ఎస్ శ్రేణులకు పిలుపునిచ్చారు.
