ఇందిరమ్మ ఇండ్లల్లో ఉమ్మడి వరంగల్ జిల్లా తెలంగాణలోనే టాప్ : మంత్రి పొంగులేటి

ఇందిరమ్మ ఇండ్లల్లో ఉమ్మడి వరంగల్ జిల్లా తెలంగాణలోనే టాప్ : మంత్రి పొంగులేటి

 

 ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో మొదటి విడతగా 3 వేల 500 ఇళ్లను పూర్తి చేసి వరంగల్ జిల్లా రాష్ట్రంలోనే అగ్రస్థానంలో నిలిచిందని.. తాజాగా రెండో విడతలో మరో2 వేల 500  ఇళ్లను మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. హైదరాబాద్, నిజామాబాద్ తరహాలోనే వరంగల్ - హనుమకొండ అర్బన్ పరిధిలోని నిరుపేదల కోసం పైలట్ ప్రాజెక్ట్ కింద రెండు నియోజకవర్గాల్లో నాలుగొందల ఎనభై చొప్పున 'ఇందిరమ్మ టవర్ల' నిర్మాణం చేపట్టనున్నట్లు వెల్లడించారు. అర్బన్ పేదలకు ఎలాంటి రిజిస్ట్రేషన్ ఛార్జీలు లేకుండా ఉచితంగా రిజిస్ట్రేషన్ చేసి ఈ ఇళ్లను అప్పగిస్తామని చెప్పారు. ప్రభుత్వ సంక్షేమ ఫలాలు క్షేత్రస్థాయిలో ప్రజలందరికీ చేరేలా అధికారులు బాధ్యతాయుతంగా పనిచేయాలని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి హెచ్చరించారు.

రైతుల భూ సమస్యల శాశ్వత పరిష్కారమే ధ్యేయంగా తెలంగాణ ప్రభుత్వం ముందుకు వెళ్తోందని  స్పష్టం చేశారు. ఆరు దశాబ్దాలుగా కేసముద్రం మండలం నారాయణపురంలో అపరిష్కృతంగా ఉన్న భూ సమస్యకు ప్రభుత్వం శాశ్వత పరిష్కారం చూపిందని వెల్లడించారు. 1,400 ఎకరాలకు పైగా భూమికి సంబంధించి 790 మంది రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాలను పంపిణీ చేసినట్లు ఆయన తెలిపారు.

రాష్ట్రవ్యాప్తంగా ప్రతి జిల్లాలో మొదటి విడతగా 70 రెవెన్యూ గ్రామాలలో సమగ్ర భూ సర్వే కార్యక్రమాన్ని చేపట్టినట్లు మంత్రి పేర్కొన్నారు. వివాదాలు లేని భూ హక్కులను రైతులకు అందించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమన్నారు. గత ప్రభుత్వ హయాంలో లేదా పొరపాటున 22(ఏ) నిషేధిత జాబితాలో చేర్చిన ప్రభుత్వేతర భూములను ఇప్పటికే తొలగించామని, అర్హులైన పేదలు, రైతుల భూములు ఎక్కడైనా ఈ జాబితాలో ఉంటే వాటిని పరిష్కరించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని పొంగులేటి భరోసానిచ్చారు.