రాజన్న సిరిసిల్ల జిల్లాలో క్షుద్ర పూజలు, చేతబడుల పేరుతో అమాయక ప్రజలను మోసగిస్తున్న ఘరానా మోసగాళ్ల బాగోతం బట్టబయలైంది. అనారోగ్యాన్ని నయం చేస్తామంటూ నమ్మించి, బాధితురాలి నుంచి లక్షల రూపాయలు వసూలు చేసిన ఇద్దరు నిందితులను సిరిసిల్ల పోలీసులు అరెస్ట్ చేశారు.
జిల్లా ఎస్పీ మహేష్ బి గీతే మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు. నిందితులు ఓ బాధితురాలి అనారోగ్యాన్ని నయం చేస్తామని నమ్మించి, పూజల పేరుతో పలు ప్రాంతాలకు తిప్పుతూ దాదాపు 62 లక్షల రూపాయలు వసూలు చేశారు. బాధితులు తమ డబ్బులు తిరిగి అడగడంతో.. చేతబడి చేసి చంపేస్తామని బెదిరింపులకు దిగారు. అంతేకాకుండా, పొలంలో గుప్త నిధులు ఉన్నాయంటూ మరోసారి నమ్మించే ప్రయత్నం చేశారు.
బాధితురాలి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు దర్యాప్తు చేపట్టి ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి 30 లక్షల 50 వేల రూపాయల నగదుతో పాటు, రెండు సెల్‌ఫోన్లు, బెల్లంతో తయారు చేసిన రెండు బొమ్మలు, పసుపు, కుంకుమ ఇతర పూజా సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు. మూఢనమ్మకాల పేరుతో మోసాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని ఎస్పీ హెచ్చరించారు.
