మహారాష్ట్రలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం నిర్మల్ జిల్లాలో తీవ్ర విషదాన్ని నింపింది. శ్రావణ సోమవారం సందర్భంగా దైవ దర్శనానికి వెళ్లి వస్తున్న నలుగురు వ్యక్తులు రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. నిర్మల్ జిల్లా కుబీర్ మండల సరిహద్దులోని మహారాష్ట్ర తోటంబాల్ వద్ద ఈ విషాద ఘటన చోటుచేసుకుంది.
శ్రావణ సోమవారం కావడంతో ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండలంలోని కైలాస్ టెక్డి శివాలయాన్ని దర్శించుకుని, ఆ తర్వాత మహారాష్ట్రలోని సాసర్ కొండ జలపాతాన్ని సందర్శించి వీరంతా తిరిగి ఇంటికి బయలుదేరారు. మార్గమధ్యలో వీరు ప్రయాణిస్తున్న జీపు అదుపుతప్పి బోల్తాపడింది.ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందగా, మరోకరు ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో ప్రాణాలు కోల్పోయారు.
మృతులను కుబీర్ మండలం పార్డి (బి) గ్రామానికి చెందిన డ్రైవర్ తులసిరామ్, గంగన్న, గంగాబాయిగా గుర్తించారు. మరో వ్యక్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన మరికొందరిని చికిత్స నిమిత్తం బైంసా ఆస్పత్రికి తరలించారు. ఒకే గ్రామానికి చెందిన నలుగురు దుర్మరణం చెందడంతో పార్డి (బి) గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
