అన్నాహజారేకు అస్వస్థత.. ముంబై ఆస్పత్రికి తరలింపు

అన్నాహజారేకు అస్వస్థత.. ముంబై ఆస్పత్రికి తరలింపు

ప్రముఖ సామాజిక ఉద్యమకారుడు అన్నా హజారే అస్వస్థతకు గురయ్యారు. తీవ్రమైన వైరల్ ఇన్ఫెక్షన్ , డీహైడ్రేషన్  కారణంగా ఆయనను కుటుంబ సభ్యులు ముంబైలోని ఆస్పత్రిలో చేర్చారు. అంతకు ముందు  మహారాష్ట్రలోని రాలేగావ్ సిద్ధిలో  స్థానిక ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా  ఆరోగ్యం మరింత క్షీణించడంతో ముంబైలోని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయనను ఐసీయూలో ఉంచి ప్రత్యేక వైద్యుల పర్యవేక్షణలో చికిత్స అందిస్తున్నట్లు సమాచారం.

ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని, వైద్యులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. ప్రజా పోరాటాలతో దేశ రాజకీయాలను శాసించిన అన్నా హజారే త్వరగా కోలుకుని సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి రావాలని దేశవ్యాప్తంగా ఉన్న ఆయన అభిమానులు ఆ దేవుడిని ప్రార్థిస్తున్నారు.

15 సంవత్సరాల క్రితం 'ఇండియా ఎగైనెస్ట్ కరప్షన్ ఉద్యమంతో దేశ రాజకీయాలను కుదిపివేసిన అన్నా హజారే.. ఇటీవల నీట్ (NEET) పేపర్ లీక్ ఉదంతంపై ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద జరిగిన నిరసనలకు ఆయన తన పూర్తి మద్దతును ప్రకటించారు.ఈ క్రమంలో జూలై 20న నిర్వహించిన పార్లమెంట్ మార్చ్ ర్యాలీ సందర్భంగా నిరసన తెలుపుతున్న శ్రేణులపై పోలీసులు చూపిన దౌర్జన్యాన్ని, హింసను అన్నా హజారే తీవ్రంగా ఖండించారు.

ప్రజాస్వామ్యంలో శాంతియుతంగా నిరసన తెలిపే హక్కు ప్రతి ఒక్కరికీ ఉంటుందని, విద్యావ్యవస్థలోని అక్రమాలను ప్రశ్నిస్తున్న వారిపై హింసకు పాల్పడటం సరికాదని ఆయన అభిప్రాయపడ్డారు. తన జీవితాంతం అవినీతిపై రాజీలేని పోరాటం చేసిన అన్నా హజారే.. ఈ వయసులో కూడా విద్యార్థుల భవిష్యత్తు కోసం నిలబడటం విశేషం. నీట్ పేపర్ లీక్ వల్ల తీవ్రంగా నష్టపోయిన అభ్యర్థులకు న్యాయం జరిగే వరకు తమ పోరాటం కొనసాగుతుందని, ఈ విషయంలో ప్రభుత్వం బాధ్యతాయుతంగా వ్యవహరించాలని ఆయన డిమాండ్ చేశారు.