మేడిగడ్డకు పోతం .. కాళేశ్వరం అంటే ఏంటో ప్రజలకు వివరిస్తం: కేటీఆర్

మేడిగడ్డకు పోతం .. కాళేశ్వరం అంటే ఏంటో ప్రజలకు వివరిస్తం: కేటీఆర్
  • ప్రాజెక్టులోని అన్ని బ్యారేజీలు, పంప్ హౌస్​లు, రిజర్వాయర్లనూ పరిశీలిస్తం
  • కాళేశ్వరం కామధేనువు.. దాంతోనే ఆకలి కేకల తెలంగాణ 
  • అన్నం గిన్నెగా మారిందిమేడిగడ్డకు చిన్న డ్యామేజీ 
  • అయిందంతే.. కాఫర్ డ్యామ్ కట్టి, రెండు నెలల్లో రిపేర్లు చేయొచ్చు
  • బ్యారేజీ కొట్టుకుపోయేలా ప్రభుత్వం కుట్రచేస్తున్నదని ఆరోపణ 

హైదరాబాద్, వెలుగు: మార్చి ఒకటో తేదీన మేడిగడ్డ బ్యారేజీకి వెళ్తామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. ‘‘పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, నాయకులతో కలిసి మేడిగడ్డ పర్యటనకు వెళ్తాం. ఈ పర్యటన ద్వారా కాళేశ్వరం ప్రాజెక్టు అంటే ఏంటో ప్రజలకు వివరిస్తాం. మేడిగడ్డతో మొదలు పెట్టి అన్ని బ్యారేజీలు, పంప్‌‌హౌస్ లు, రిజర్వాయర్లనూ పరిశీలిస్తాం” అని చెప్పారు. మంగళవారం తెలంగాణ భవన్‌‌లో మీడియాతో కేటీఆర్ మాట్లాడారు. మేడిగడ్డ బ్యారేజీకి చిన్న డ్యామేజే అయిందని ఆయన వ్యాఖ్యానించారు. 

కాఫర్‌‌‌‌ డ్యామ్ కట్టి రెండు నెలల్లోనే బ్యారేజీకి రిపేర్లు చేయించవచ్చునని, వచ్చే వర్షాకాలం నాటికి నీళ్లు నింపొచ్చునని అన్నారు. ఇప్పటికైనా నీళ్లను సముద్రంలోకి వదిలేయకుండా, ఒక పంపును స్టార్ట్ చేసి ఎత్తిపోయాలని ప్రభుత్వానికి సూచించారు. ‘‘బ్యారేజీలు కుంగడం ఇదేమీ కొత్త కాదు. కాంగ్రెస్ హయాంలో నిర్మించిన కడెం ప్రాజెక్టు, గుండ్ల వాగు, మూసి ప్రాజెక్ట్, సింగూర్, పులిచింతల, ప్రకాశం బ్యారేజీ వంటి అనేక ప్రాజెక్టుల్లో ఇలాంటి సమస్యలు వచ్చాయి. వాటిని రిపేర్ చేయించడమో, పునర్నిర్మించడమో చేశారు. ఇప్పుడు కూడా అలాగే చేయాలి. మేడిగడ్డ కుంగడానికి మెయింటెనెన్స్ లేకపోవడమో, మరో కారణమో విచారణ జరిపి అసలు నిజం తేల్చాలి. బాధ్యులపై చర్యలు తీసుకోవాలి. అన్ని రకాల విచారణలకు మేం సిద్ధంగా ఉన్నాం” అని కేటీఆర్​ తెలిపారు. 

 తెలంగాణ భౌగోళిక పరిస్థితుల దృష్ట్యా, కాలు అడ్డం పెడితే నీళ్లొచ్చే పరిస్థితి లేదని కేటీఆర్ వ్యాఖ్యానించారు. ‘‘పొలాలకు నీళ్లు ఇవ్వడానికి ఎత్తపోతల పథకాలే శరణ్యం. ప్రాజెక్టు ఖర్చు గురించి, వయబులిటీ గురించి ఆలోచించవద్దు. కాళేశ్వరం ప్రాజెక్టు అనేది ఒక భగీరథ ప్రయత్నం. అది 40 లక్షల ఎకరాలకు నీళ్లు ఇచ్చే కామధేనువు. ఆ ప్రాజెక్టుతో ఆకలికేకల తెలంగాణ అన్నం గిన్నెగా మారింది” అని అన్నారు. 

కాగా, కాళేశ్వరంలో అవినీతి, ఇతర పథకాల అమలుపై కాగ్ ఇచ్చిన రిపోర్ట్‌‌‌‌‌‌‌‌ గురించి మీడియా ప్రశ్నించగా.. ‘‘కాగ్ రిపోర్ట్‌‌‌‌‌‌‌‌ను గతంలో కాంగ్రెస్ ప్రభుత్వాలు తప్పుబట్టాయి. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌‌‌‌‌‌‌‌, మాజీ సీఎం కిరణ్‌‌‌‌‌‌‌‌కుమార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి అప్పట్లో కాగ్ రిపోర్టులను తప్పుబట్టారు. అప్పుడు కాగ్ చెప్పింది అబద్ధమైతే.. ఇప్పుడు చెప్పింది అబద్ధమే. అప్పుడు నిజమైతే, ఇప్పుడు నిజాలే” అని కేటీఆర్ అన్నారు. 

ప్రభుత్వం కుట్ర చేస్తున్నది.. 

కాళేశ్వరం ప్రాజెక్టులోని బ్యారేజీలు కొట్టుకుపోయేలా ప్రభుత్వం కుట్ర చేస్తున్నదని కేటీఆర్ ఆరోపించారు. ‘‘సీఎం రేవంత్‌‌‌‌‌‌‌‌ రెడ్డి మాట్లాడుతున్న తీరు, ఆయన ప్రకటనలు, ఆలోచనలు చూస్తుంటే కుట్రపూరితమైన వైఖరితోనే ప్రభుత్వం ఉన్నట్టుగా అనిపిస్తున్నది. కాళేశ్వరం ప్రాజెక్టులోని మూడు బ్యారేజీలు కొట్టుకుపోవాలనే ఆలోచన, దుర్బుద్ధి, కుట్ర ప్రభుత్వం చేస్తున్నట్టుగా అనుమానం ఉన్నది. ఇప్పుడు బ్యారేజీలకు రిపేర్లు చేయకుండా వదిలేసి, వర్షాకాలంలో వరదలొస్తే అవి కొట్టుకుపోవాలని వాళ్లు కోరుకుంటున్నారు.

 తద్వారా బీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌ను నిందించాలని చూస్తున్నారు. కేసీఆర్ కట్టినవన్నీ కొట్టుకుపోయాయని ప్రజలకు చెప్పాలనే చిల్లర ఆలోచన వారి మాటల్లో కనిపిస్తున్నది” అని అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టును ఫెయిల్యూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా చూపించి, కేసీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను బద్నాం చేయాలని చూస్తున్నారని ఆరోపించారు. రాజకీయ కక్షలు, కోపాలు ఉంటే తమపై తీర్చుకోవాలి తప్పితే.. నీళ్లు ఇవ్వకుండా రైతులను మోసం చేయొద్దన్నారు.