బీఆర్ఎస్​ పుట్టిందే ప్రజల హక్కుల కోసం: కేసీఆర్

బీఆర్ఎస్​ పుట్టిందే ప్రజల హక్కుల కోసం: కేసీఆర్
  • అబద్ధాలు చెప్పి టక్కు టమారాలతో గెల్వడం ఎందుకు?
  • ప్రజలు గెలువాలె.. పార్టీలు కాదు.. కాంగ్రెస్ ​వస్తే కరెంట్​ కాటగలుస్తది
  • అదే జరిగితే నేను కూడా ఏం చేయలేను
  • బాల్కొండ, ధర్మపురి, నిర్మల్ సభల్లో కేసీఆర్

నిజామాబాద్/నిర్మల్/జగిత్యాల, వెలుగు: ‘‘మనందరి కోసం 24 ఏండ్ల నుంచి నేను మస్తు కొట్లాడిన. తెలంగాణ వచ్చేదాక కొట్లాడినం.. తెలంగాణ వచ్చిన తర్వాత పదేండ్లు కొట్లాడినం.. ఇప్పుడు మీరు కొట్లాడాలె’’ అని బీఆర్ఎస్​ అధినేత,  సీఎం కేసీఆర్ ​అన్నారు. బీఆర్ఎస్ పుట్టిందే తెలంగాణ ప్రజల కోసమని, ప్రజల హక్కులు కాపాడేందుకని, రాష్ట్రానికి కాపలాదారుగా ఉంటుందన్నారు. గురువారం నిజామాబాద్​జిల్లా బాల్కొండ నియోజకవర్గంలోని వేల్పూర్, నిర్మల్, జగిత్యాల జిల్లా ధర్మపురిలో జరిగిన ప్రజా ఆశీర్వాద సభల్లో  ఆయన మాట్లాడారు. ‘‘ఎన్నికలు వస్తయ్ పోతయ్, పోటీ చేసే నలుగురిలో ఒకరు గెలుస్తరు. అభ్యర్థుల గుణగణాలు చూసి ఓటేస్తం. వారి వెనుక ఒక పార్టీ ఉంటది. గెలిచిన వారితో గవర్నమెంట్​ఏర్పడ్తది. గెలిచిన వాళ్ల వెనుక ఉన్న పార్టీ తొవ్వ, నడక, చరిత్ర, దృక్పథం చూసి ఓటెయ్యాలె. ప్రజల మధ్య ఓటు చర్చ జరగాలె. అప్పుడు వేసే ఓటుతో ప్రజలు గెలిచినట్లయితది. ఎన్నికల్లో అబద్ధాలు చెప్పి టక్కుటమారాలతో గెలవడం ఎందుకు? కిస్మత్​బదలాయించేది ఓటు’’ అని కేసీఆర్ అన్నారు. ధరణిని ఎత్తేస్తం, వ్యవసాయానికి 3 గంటల కరెంట్​ఇస్తమంటున్న కాంగ్రెస్..​ ఒక్క చాన్స్​అంటూ ప్రజల దగ్గరికి వస్తోందన్నారు. ‘50 ఏండ్లు అవకాశం ఇస్తే ఏం చేసిండ్రు. ఇప్పుడిస్తే పంటికి అంటకుంటా మింగుతరా’ అని ప్రశ్నించారు. కాంగ్రెస్​వస్తే రైతుబంధుకు రామ్​రామ్, దళితబంధుకు జైభీమ్, ఉచిత కరెంట్​కు కాటగలుస్తదన్నారు. అదే జరిగితే తానుకూడా ఏమీ చేయలేనన్నారు. ‘నేను కాపును, నాకు ఎవుసం ఉన్నది. గత పాలకుల వల్ల బాధలు పడ్డ  రైతుల స్థితి మార్చడానికి వ్యవసాయ రంగాన్ని స్థిరీకరించిన. నీటి తీరువా రద్దుతో స్టార్ట్​చేసి 24 గంటల ఉచిత కరెంటు ఇస్తున్నం. రైతుబంధు, బీమా అమలు చేస్తున్నం. రైతులు పండించిన ధాన్యం కొని పది రోజుల్లో అకౌంట్లలో డబ్బులు జమచేస్తున్నం. అప్పులు తీర్చుకొని పంట కోసం రైతు సొంతంగా పెట్టుబడి పెట్టుకునే రోజు రావాలి. రైతు దగ్గర డబ్బుంటే ఊరంతా ఉంటది’ అని అన్నారు. దారీ తీరులేని తెలంగాణను తొవ్వకు తెచ్చామని, ఫలితాలు ప్రజలే చూస్తున్నారని కేసీఆర్​పేర్కొన్నారు. ‘ప్రధాని మోదీకి ప్రభుత్వరంగ సంస్థల ప్రైవేటీకరణ పిచ్చి పట్టింది. సంస్కరణల పేరుతో విమానాలు, ఓడరేవులు, రైల్వేను ప్రైవేటుపరం చేస్తుండు. ఆ లిస్ట్​లో కరెంటునే చేర్చి వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెట్టాలని నన్ను బెదిరించిండు. రాష్ట్రానికి యాడాదికి ఇవ్వాల్సిన రూ.5 వేల కోట్లు ఇవ్వనని వార్నింగ్​ఇచ్చిండు. ఈ రకంగా రూ.25 వేల కోట్లు నష్టపోయినా రైతులను నష్టపరిచే విధానాన్ని వ్యతిరేకించిన’ అని కేసీఆర్​చెప్పారు. బీజేపీని నమ్మే స్థితిలో ఇక్కడి ప్రజలు లేరని పేర్కొన్నారు.    రైతుబంధును కాంగ్రెస్​నేత ఉత్తమ్​కుమార్​రెడ్డి తప్పుబడుతున్నారని, ఇది దుబారా అని అంటున్నారని మండిపడ్డారు. ‘‘కాంగ్రెస్ వస్తే ధరణి తీసేస్తా అని రాహుల్​గాంధీ అంటున్నరు.. ధరణి తీసేస్తే రైతు బంధు ఎట్లా రావాలి?  రైతు బీమా ఎట్ల రావాలి? మళ్లీ  పైరవీ కారుల,  దళారీల రాజ్యం వస్తది’ అని అన్నారు. భూరికార్డులను అడ్డగోలుగా మార్చి రైతులను కోర్టుల చుట్టూ తిప్పిన వ్యవస్థను సమూలంగా మార్చామని, ధరణి వల్లే ఇది సాధ్యమైందన్నారు. ధరణిలో 98 శాతం సమస్యలు పరిష్కారమయ్యాయని, 2శాతం సమస్యలు ఉంటే ఎమ్మెల్యేలకు చెప్తే సెట్​చేస్తామన్నారు. దళిత సమాజం దగా పడిందని, తరతరాలుగా అణచివేత, దోపిడీకి గురైందని సమాజం ఇట్లా ఉండటం మనందరికీ సిగ్గు చేటన్నారు. దళితులను  పైకి తీసుకురావాలని ఆలోచించానని, దేశంలోని ఏ ప్రధాని, సీఎం దళితబంధు గురించి  ఆలోచన చేయలేదన్నారు.   దళితులను ఓటు బ్యాంకుగా చేసి, అమ్మ పేరు.. బొమ్మ పేరు చెప్పి ఓట్లు గుంజుకున్నరే తప్ప వాళ్లకు ఎన్నడూ మేలు చేయలేదన్నారు.  ప్రధాని నెహ్రూ ఉన్నప్పుడే దళితుల సంక్షేమం గురించి ఆలోచించి ఉంటే ఇప్పుడు పరిస్థితి ఇలా ఉండేది కాదని కేసీఆర్​విమర్శించారు.  

నేను ప్రశ్నించినంకనే గోదావరి పుష్కరాలు

ఉద్యమ సమయంలో ధర్మపురి క్షేత్రానికి వచ్చి ఇక్కడ గోదావరి పుష్కరాలు ఎందుకు చేయరని తాను ప్రశ్నించేదాకా..  ఏ నాయకుడికి సోయి లేదని కేసీఆర్​విమర్శించారు. విజయవాడ, రాజమండ్రి గోదావరి పుష్కరాలు జరిపితే  మనోళ్లు అక్కడికి వెళ్లి గుండు కొట్టించుకొని జేబులు ఖాళీ చేసుకోవాల్సి వచ్చేదన్నారు. తాను ప్రశ్నించిన తర్వాతే తెలంగాణలో గోదావరి పుష్కరాలు జరిగాయన్నారు. ధర్మపురి ఆలయ అభివృద్ధికి రూ. వంద కోట్లు మంజూరు చేసుకున్నామని,  పనులు జరుగుతున్నాయని, ఇంకా అవసరమైతే  మరిన్ని నిధులిచ్చి అద్భుత పుణ్య క్షేత్రంగా తీర్చిదిద్దుకుందామని చెప్పారు. ఈ కార్యక్రమాల్లో మంత్రులు ప్రశాంత్​రెడ్డి, అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి, కొప్పుల ఈశ్వర్, రాజ్యసభ సభ్యుడు దామోదర్ రావు, ఎమ్మెల్సీ దండే విఠల్, ఖానాపూర్ అభ్యర్థి జాన్సన్ నాయక్, బోథ్ అభ్యర్థి అనిల్ జాదవ్, మాజీ ఎంపీ వేణుగోపాల చారి, మున్సిపల్ చైర్మన్ ఈశ్వర్, పార్టీ సీనియర్ నాయకుడు సత్యనారాయణ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.