
మోసపూరిత హామీలతో తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. ఇచ్చిన హామీలను వంద రోజులలో అమలు చేయకపోతే 2024 మార్చి 17 తరువాత సీఎం రేవంత్ రెడ్డికి గట్టి సమాధానం చెబుతామని అన్నారు. శనివారం కూకట్ పల్లి అసెంబ్లీ నియోజకవర్గ పార్టీ కార్యకర్తలతో జరిగిన సమావేశంలో కేటీఆర్ మాట్లాడారు. హైదరాబాద్ లో జరిగిన అభివృద్ధి చూసి బీఆర్ఎస్ కు పట్టం కట్టారని కేటీఆర్ చెప్పారు.
గడిచిన పదేళ్లలో కరెంట్ పోలేదని.. కానీ ఇప్పుడు కాంగ్రెస్ రాగానే 60 రోజుల్లో కరెంట్ కరెంట్ కష్టాలుమొదలయ్యాయని.. హైదరాబాద్ గల్లీల్లోకి వాటర్ ట్యాంకర్లు వస్తున్నాయన్నారు. చీకటి ఉంటేనే వెలుతురు తెలుస్తుందన్నారు. కాంగ్రెస్ పార్టీ హామీలను గుర్తు చేయాల్సిన బాధ్యత తమ పార్టీపై ఉందన్నారు.
కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తేనే ఇచ్చిన హామీలు నెరవేరుస్తామని సీఎం రేవంత్ రెడ్డి అంటున్నారని.. గడిచిన పదేళ్లు ప్రధాని మోడీ తమకు సహకరించకపోయిన తాము ఇచ్చిన హామీలు నెరవేర్చామన్నారు కేటీఆర్. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణ ప్రయోజనాల కోసం పోరాడే ఎంపీలు ఉండాలన్నారు. సీఎం రేవంత్ తన స్థాయి మరిచి కేసీఆర్ ను తిడుతున్నారన్నారని కేటీఆర్ అన్నారు.