
- స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ సత్తా చాటాలి
- బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
తల్లాడ, వెలుగు : రాష్ట్రంలో ఎన్‌టీఆర్ నుంచి ఇప్పటివరకు ఎందరో సీఎంలను చూశానని, కానీ రేవంత్‌రెడ్డి వంటి సీఎంను మాత్రం ఎన్నడూ చూడలేదని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీమంత్రి కేటీఆర్ అన్నారు. ఢిల్లీ వెళ్తే దొంగల్లా చూస్తున్నారని అంటున్నారని.. దొంగలను దొంగల్లా కాకపోతే ఎలా చూస్తారని ప్రశ్నించారు. ఖమ్మం జిల్లా తల్లాడ మండలం మిట్టపల్లిలో ఏర్పాటు చేసిన డీసీఎంఎస్ మాజీ చైర్మన్ రాయల వెంకట శేషగిరిరావు కాంస్య విగ్రహాన్ని శుక్రవారం కేటీఆర్ ఆవిష్కరించారు.
అనంతరం జరిగిన సభలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ మాయమాటలు విని ప్రజలు మోసపోయారని, ఇప్పుడు ఐదేండ్లు భరించాల్సిందేనన్నారు. బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు, మంత్రులు పదేండ్లు.. కాలుకు బలపం కట్టుకొని రైతులు, నిరుపేదలకు, నిరుద్యోగుల కోసం కష్టపడ్డారని గుర్తు చేశారు. ఎన్నికల్లో గెలిచేందుకు భట్టి విక్రమార్క ప్రజలకు తప్పుడు హామీలు ఇచ్చి, బాండ్ పేపర్ రాసి దేవుడి గుడిలో పెట్టారని, ఇప్పుడు ఆ హామీలన్నీ ఏమయ్యాయని ప్రశ్నించారు.
ఖమ్మం జిల్లాలో ముగ్గురు మంత్రులు ఉన్నా వడ్ల కొనుగోళ్లు జరగకపోవడం సిగ్గుచేటన్నారు. 10 లక్షల ఎకరాలకు సాగునీరు ఇచ్చేందుకు కేసీఆర్ సీతారామ ప్రాజెక్ట్ కడితే కాంగ్రెస్ ప్రభుత్వంలోని మంత్రులు.. ఆ నీళ్లను నెత్తిన చల్లుకున్నారే తప్ప చుక్క నీరు కూడా పొలాలకు ఇవ్వలేదన్నారు. ఆరు గ్యారంటీలు, 100 రోజులు అని డైలాగ్‌లు కొట్టిన కాంగ్రెస్ నాయకులను హామీల గురించి ప్రశ్నిస్తూనే ఉంటామన్నారు.
భద్రాచలం అసెంబ్లీ స్థానానికి తప్పనిసరిగా ఉపఎన్నిక వస్తుందని, బీఆర్ఎస్ విజయం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్‌కు బుద్ధి చెప్పేందుకు కేడర్ సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో మాజీమంత్రి పువ్వాడ అజయ్‌కుమార్, రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తాత మధుసూదన్, కొండబాల కోటేశ్వరరావు పాల్గొన్నారు. అంతకుముందు రేజర్ల అంజనాపురం నుంచి రోడ్‌షో నిర్వహించారు.