శాంతిభద్రతలు దిగజారినయ్..దివాలాలో ఉన్న కేఎల్ఎస్ఆర్ కంపెనీకి వేల కోట్ల కాంట్రాక్టులు కట్టబెట్టారు: కేటీఆర్

శాంతిభద్రతలు దిగజారినయ్..దివాలాలో ఉన్న కేఎల్ఎస్ఆర్ కంపెనీకి వేల కోట్ల కాంట్రాక్టులు కట్టబెట్టారు: కేటీఆర్
  • దానికి సంబంధించిన కేసులో సాక్ష్యాధారాలను తారుమారు చేశారని ఆరోపణ
  • ఆ వ్యవహారంపై సీబీఐ, ఈడీతో విచారణ జరిపించాలని అమిత్​ షాకు లేఖ

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో శాంతిభద్రతలు దిగజారిపోయాయని బీఆర్ఎస్​ వర్కింగ్​ ప్రెసిడెంట్​ కేటీఆర్​ అన్నారు. విచారణ సంస్థలు, పోలీస్​ వ్యవస్థపై ప్రజలకు నమ్మకం పోయే పరిస్థితి ఏర్పడిందన్నారు. అంతేకాకుండా దివాలా తీసిన రేవంత్​ రెడ్డి బినామీ కంపెనీ కేఎల్ఎస్ఆర్​ ఇన్​ఫ్రాటెక్​  ప్రైవేట్​ లిమిటెడ్​కు అక్రమంగా కాంట్రాక్టులు కట్టబెడుతున్నారని ఆరోపించారు.

ఆ సంస్థ కేసుల విచారణకు సంబంధించి.. సీఎం ఆదేశాల మేరకు సాక్ష్యాలను తారుమారు చేశారన్నారు. విచారణలో సేకరించిన కీలక సాక్ష్యాలు పోయాయని అధికారులు కోర్టుకు చెప్పడం అత్యంత దురదృష్టకరమన్నారు. రాష్ట్రంలో దిగజారిన శాంతిభద్రతలు, దర్యాప్తు విభాగాలపై ఉన్న ఒత్తిడికి ఇది నిదర్శనమని పేర్కొన్నారు. ఈ మేరకు శుక్రవారం ఆయన కేంద్ర హోం మంత్రి అమిత్​ షాకు లేఖ రాశారు.

దివాలా ప్రక్రియ కొనసాగుతున్న కంపెనీకి రూ.2500 కోట్లకుపైగా విలువైన ప్రభుత్వ కాంట్రాక్టులు కేటాయించినట్టు పలు నివేదికలు చెబుతున్నాయన్నారు. సాగునీటి ప్రాజెక్టులు, తాగునీటి సరఫరా పనులు, యంగ్  ఇండియా ఇంటిగ్రేటెడ్​ స్కూల్​ ప్రాజెక్టులు, రోడ్ల నిర్మాణ పనులు వంటి అనేక కీలక ప్రభుత్వ ప్రాజెక్టులను ఈ కంపెనీకి అప్పగించారని చెప్పారు.

కంపెనీకి సంబంధించిన దివాలా ప్రక్రియ నేషనల్  కంపెనీ లా అప్పిలేట్  ట్రిబ్యునల్  ముందు విచారణలో ఉండగానే.. విచారణను ప్రభావితం చేసే ప్రయత్నం చేశారని పేర్కొన్నారు. ట్రిబ్యునల్​ మెంబర్​ జస్టిస్​ శరద్​ కుమార్​ నిరుడు ఆగస్టు 13న కేసు విచారణ నుంచి తప్పుకున్నారన్నారు. 2022లో కేఎల్ఎస్ఆర్​ కంపెనీపై దివాలా ప్రక్రియ ప్రారంభించిన ఏఎస్​ మెట్​ కార్ప్​ సంస్థపై ప్రభుత్వం ప్రతీకార చర్యలకు దిగిందన్నారు.

అందులో భాగంగానే కేన్సర్​తో బాధపడుతున్న 75 ఏండ్ల వృద్ధుడిని అరెస్ట్​ చేశారని పేర్కొన్నారు. తెలంగాణ హైకోర్టులో రిట్​ పిటిషన్​ 18267/2025పై విచారణ జరుగుతున్నప్పుడు.. సాక్ష్యాధారాలుగా స్వాధీనం చేసుకున్న కీలక పత్రాలు అధికారుల కస్టడీ నుంచి కనిపించకుండా పోయాయని ఆరోపించారు. దీనిపై చీఫ్​ జస్టిస్​ కూడా తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారన్నారు.

ఇటీవల ఫోరెన్సిక్  సైన్స్ లేబొరేటరీలో జరిగిన అగ్నిప్రమాదం కూడా సాక్ష్యాధారాల భద్రతపై అనుమానాలను మరింత పెంచిందన్నారు. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని కేఎల్ఎస్ఆర్​ కంపెనీపై ఉన్న ఆర్థిక ఆరోపణలు, కాంట్రాక్టుల కేటాయింపుల్లో అక్రమాలు, మనీ లాండరింగ్​పై  సీబీఐ, ఈడీ, సీరియస్​ ఫ్రాడ్​ ఇన్వెస్టిగేషన్​ ఆఫీస్​ (ఎస్ఎఫ్ఐఓ) వంటి కేంద్ర సంస్థలతో నిష్పక్షపాత విచారణ జరిపించాలని అమిత్​ షాను కోరారు.  కాగా, ఈ లేఖను కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్​, పీయూష్​ గోయల్​, అర్జున్​ రామ్​ మేఘవాల్​కూ పంపారు.