ఏడాదిలో479 శాతం పెరిగిన బీఆర్​ఎస్​ ఆదాయం

ఏడాదిలో479 శాతం పెరిగిన బీఆర్​ఎస్​ ఆదాయం
  • బీఆర్​ఎస్​ ఆదాయం ఏడాదిలో479 శాతం పెరిగింది
  • 2020--21లో రూ.37 కోట్లు.. 2021--22లో రూ.218 కోట్లు
  • అసోసియేషన్​ ఫర్​ డెమొక్రటిక్​ రిఫార్మ్స్​ రిపోర్ట్​లో వెల్లడి

హైదరాబాద్, వెలుగు: ఒక్క ఏడాదిలోనే భారత రాష్ట్ర సమితి (బీఆర్​ఎస్) ఆదాయం 479.19 శాతం పెరిగింది.  వార్షికాదాయం ఎక్కువొస్తున్న రీజనల్​పార్టీల జాబితాలో మూడో స్థానంలో నిలిచింది. 2021–22 సంవత్సరానికిగాను దేశంలోని 36 రీజనల్​ పార్టీలకు సంబంధించిన ఆదాయ వ్యయాలపై అసోసియేషన్​ ఫర్​ డెమొక్రటిక్​ రిఫార్మ్స్​ (ఏడీఆర్) అనే సంస్థ ఇటీవల ఓ రిపోర్ట్​ రిలీజ్​చేసింది. దాని ప్రకారం రూ.318.745 కోట్లతో తమిళనాడులోని అధికార డీఎంకే పార్టీ మొదటి స్థానంలో ఉండగా, రూ.307.288 కోట్లతో ఒడిశాలోని అధికార బీజేడీ పార్టీ  రెండో స్థానంలో ఉంది. రూ.218.112 కోట్ల ఆదాయం కలిగిన కేసీఆర్​ నేతృత్వంలోని బీఆర్​ఎస్​ మూడో స్థానంలో ఉంది. ఏడీఆర్​ రిపోర్ట్​ ప్రకారం.. బీఆర్​ఎస్​ రాబడి ఒక్క ఏడాదిలోనే గణనీయంగా పెరిగింది. అంతకుముందు ఏడాదితో పోలిస్తే రూ.180.454 కోట్లు పెరిగింది. 2020–21లో పార్టీ ఇన్​కమ్​ కేవలం రూ.37.658 కోట్లే. ఆదాయం పెరుగుదలలో బీజేడీ (రూ.233.941 కోట్లు పెరుగుదల) తర్వాత బీఆర్​ఎస్​ పార్టీనే ఉండడం గమనార్హం. ఆదాయం అంతొస్తున్నా పార్టీ పెడ్తున్న ఖర్చు మాత్రం తక్కువే ఉంది. 2021–22లో బీఆర్​ఎస్​ పెట్టిన ఖర్చు కేవలం రూ.27.939 కోట్లే. అదిపోను పార్టీ దగ్గర మిగిలిన డబ్బు రూ190.173 కోట్లు.

ఎలక్టోరల్​ బాండ్స్​ ద్వారానే ఎక్కువ

పార్టీకి వచ్చిన ఆదాయంలో ఎక్కువ మొత్తం ఎలక్టోరల్​ బాండ్ల విరాళాల రూపంలోనే వచ్చింది. గ్రాంట్లు, డొనేషన్లు, ఎలక్టోరల్​బాండ్ల రూపంలో రూ.193.9375 కోట్లు రాగా.. ఇందులో ఎలక్టోరల్​ బాండ్ల ద్వారానే రూ.153 కోట్లు సమకూరాయి. ఈ విషయంలోనూ బీఆర్​ఎస్​ మూడో స్థానంలో ఉంది. తర్వాత బ్యాంకుల్లోని డిపాజిట్ల మీద వడ్డీ ద్వారా రూ.16.1271 కోట్లు, ఫీజులు, సబ్​స్క్రిప్షన్ల ద్వారా మరో రూ.8.0474 కోట్ల మేర ఆదాయం సమకూరింది. పార్టీ వ్యయంలో అత్యధికంగా రూ.19.77 కోట్లు పార్టీ నిర్వహణ కోసమే ఖర్చు చేసినట్టు ఏడీఆర్​తన రిపోర్ట్​లో పేర్కొంది. మరో రూ.7.68 కోట్లు మాత్రమే ఎన్నికల కోసం ఖర్చు చేసినట్టు వెల్లడించింది.

ఎక్కువ కేసులున్నది కేసీఆర్​పైనే

ఏడీఆర్ ​రిపోర్ట్​ ప్రకారం ఎక్కువ కేసులున్న సీఎంల జాబితాలో కేసీఆరే ముందున్నారు. ఆయన మీద 64 కేసులుండగా.. 37 తీవ్రమైన సెక్షన్లు, 283 ఇతర సెక్షన్ల కింద కేసులు నమోదై ఉన్నాయి. అయితే, ఒక్క కేసులోనూ కన్విక్షన్​ జరగలేదు. ఈ లిస్ట్​లో తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్​ (47 కేసులు) రెండో స్థానంలో, ఏపీ సీఎం వైఎస్​జగన్మోహన్​ రెడ్డి (38 కేసులు) మూడో స్థానంలో ఉన్నారు. మరోవైపు ఆస్తులు ఎక్కువగా ఉన్న సీఎంలలో కేసీఆర్​ ఆరోస్థానంలో ఉన్నారు. ఆయన ఆస్తుల విలువ కేవలం రూ.23.55 కోట్లేనని ఏడీఆర్​ రిపోర్ట్​ వెల్లడించింది. అయితే, అప్పులు ఎక్కువగా ఉన్న సీఎంలలోనూ సీఎం కేసీఆరే ఫస్ట్​ ప్లేస్​లో ఉన్నారు. కేసీఆర్​కు రూ.8.88 కోట్ల అప్పులున్నట్టు ఏడీఆర్ రిపోర్ట్​పేర్కొన్నది.