పేపర్ లీకేజీకి కేటీఆర్ కు సంబంధం ఉంది : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్

పేపర్ లీకేజీకి కేటీఆర్ కు సంబంధం ఉంది : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్

TSPSC పేపర్ లీకేజీపై బీఎస్సీ రాష్ట్ర అధ్యక్షులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్.. రాష్ట్ర ప్రభుత్వానికి మరోసారి ప్రశ్నలు సంధించారు. మొదటి నుంచి తాము చెబుతున్నట్లుగానే కేసీఆర్ కుటుంబానికి పేపర్ లీకేజీకి సంబంధం ఉందన్న విషయం రోజురోజుకు మరింత బలపడుతోందని చెప్పారు. ఐటీశాఖకు పేపర్ లీకేజీ కుంభకోణానికి ప్రత్యక్ష సంబంధం ఉందన్న విధంగా కేటీఆర్ మాట్లాడుతున్నారని అనుమానం వ్యక్తం చేశారు. తన పీఏను కూడా కేటీఆర్ అహంకారపూరితంగా మాట్లాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తనకు సంబంధం లేదంటూనే TSPSC తరపున కేటీఆర్ వాకాల్తా పుచ్చుకుని మాట్లాడుతున్నారని ఆరోపించారు. మార్చి 13న పేపర్ లీకేజీ బయటపడిన సమయంలో TSPSC చైర్మన్ జనార్ధన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టారని, ఇక అప్పటి నుంచి మీడియా ముందుకు ఆయన ఎందుకు రావడం లేదని ప్రశ్నించారు. TSPSC చైర్మన్, సభ్యులు చెప్పాల్సిన విషయాలను మంత్రి కేటీఆర్ ఎందుకు చెబుతున్నారని అనుమానం వ్యక్తం చేశారు. 

మంత్రి కేటీఆర్ కు డేటా ఎవరు ఇచ్చారని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ప్రశ్నించారు. TSPSC చైర్మన్ జనార్ధన్ రెడ్డి ఇచ్చారా..? లేదా కమిషన్ సభ్యులు కేటీఆర్ కు డేటా ఇచ్చారా..? అని అనుమానం వ్యక్తం చేశారు. TSPSCకు మంత్రి కేటీఆర్ కు ఏం సంబంధం ఉందన్నారు. కేటీఆర్ ఆఫీస్ TSPSC వ్యవహారంలో రిమోట్ గా పని చేస్తోందన్నారు. ప్రతిపక్ష నాయకులకు నోటీసులు ఇస్తూ.. కేటీఆర్ కు మాత్రం డేటా ఇస్తున్నారని చెప్పారు. ఏ హోదా కింద పేపర్ లీకేజీపై డేటాతో కేటీఆర్ మాట్లాడుతున్నారని ప్రశ్నించారు. కేటీఆర్ కు ఇచ్చిన డేటాను ప్రతిపక్ష నాయకులకు కూడా ఇవ్వాలని డిమాండ్ చేశారు.  

మొదటి నుంచి కూడా పేపర్ లీకేజీ వ్యవహారాన్ని మంత్రులు చాలా చిన్న సమస్యగా చూపిస్తున్నారని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. TSPSCకి, కేటీఆర్ కు సంబంధం ఉందని తన మాటల ద్వారానే తెలుస్తోందని చెప్పారు. పేపర్ లీకేజీ బయటపడక ముందు, బయటపడిన తర్వాత కూడా చైర్మన్ జనార్థన్ రెడ్డి.. కేటీఆర్ కు డేటా ఇస్తున్నారా..? అని ప్రశ్నించారు. ఈ అంశాన్ని చాలా చిన్నదిగా చూపిస్తూ.. కేసును పక్కదోవ పట్టించడానికి ప్రయత్నిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఇన్నాళ్లు డేటాపై కేటీఆర్ ఎందుకు మౌనంగా ఉన్నారని, లీకేజీ బయటపడ్డ సమయంలోనే వివరాలను ఎందుకు వెల్లడించలేదని ప్రశ్నించారు. 

TSPSC పేపర్ లీకేజీపై చైర్మన్ జనార్థన్ రెడ్డి, హోంమంత్రి మహమూద్ అలీ ఎందుకు మాట్లాడడం లేదని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ప్రశ్నించారు. ఈ వ్యవహారంలో తప్పనిసరిగా TSPSC చైర్మన్, సభ్యుల హస్తం ఉందని ఆరోపించారు. అభ్యర్థుల ఓఎంఆర్ షీట్ తారుమారు చేశారనే అనుమానం రోజురోజుకు మరింత బలపడుతోందన్నారు. కీలకమైన సాక్ష్యాలను చెరిపివేశారనే అనుమానం కూడా కలుగుతోందన్నారు. మార్చి 11 తేదీన పేపర్ లీకేజీ విషయం బయటకు వస్తే.. 17వ తేదీన సిట్ కు కేసును అప్పగించారని, ఈ వ్యవధిలో కంప్యూటర్లలోని కీలకమైన సమాచారాన్ని  తొలగించి ఉంటారని అనుమానం వ్యక్తం చేశారు. 

80 నుంచి 90 మార్కులు పైగా వచ్చిన వాళ్ల ఓఎంఆర్ షిట్స్ ను ఎందుకు బయటపెట్టడం లేదని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ప్రశ్నించారు. కేటీఆర్ కు సిట్ అధికారులు నోటీసులు ఇచ్చారా..? అని ప్రశ్నించారు. ఇప్పటి వరకూ సీజ్ చేసిన కంప్యూటర్లు, నిందితుల సెల్ ఫోన్లను సెంట్రల్ ఫోరెన్సిక్ ల్యాబొరేటరీకీ పంపించారా..? లేక తెలంగాణ సెంట్రల్ ఫోరెన్సిక్ ల్యాబొరేటరీ పంపించారా..? అని అడిగారు. మూడేళ్ల నుంచి కమిషన్ చైర్మన్, సభ్యుల ఫోన్ కాల్ డీటెయిల్స్ తీసుకుని సిట్ అధికారులు విచారించారా..? లేదా అని ప్రశ్నించారు.