నేతలకు మసిపూసి.. చెప్పుల దండవేసి.. గాడిదపై ఊరేగింపు

నేతలకు మసిపూసి.. చెప్పుల దండవేసి.. గాడిదపై ఊరేగింపు
  • పార్టీకి వ్యతిరేకంగా పని చేస్తున్నారని ఘోరంగా పరాభవించిన బీఎస్పీ కార్యకర్తలు

జైపూర్: పార్టీకి వ్యతిరేకంగా పని చేస్తే, ఎన్నికల్లో సీట్లు అమ్ముకుంటే ఆ నాయకుల్ని ఎవరైనా ఏం చేస్తారు..? అధిష్ఠానం దృష్టికి విషయం తీసుకెళ్లడం.. ఆ తర్వాత పార్టీ నుంచి బహిష్కరించడమో.. లేదా పదవి నుంచి తొలగించడమో చేస్తారు.

కానీ, రాజస్థాన్ లో బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) కార్యకర్తలు తమ పార్టీ నేతలను ఘోరంగా అవమానించారు. పార్టీ ఆఫీసులోనే ఇద్దరు సీనియర్ నేతల ముఖాలకు మసి పూసి, మెడలో చెప్పుల దండలు వేశారు. ఆఫీసు చుట్టూ గాడిదపై ఊరేగించారు.

మంగళవారం ఉదయం జైపూర్ లోని బీఎస్పీ ఆఫీసుకు వచ్చిన ఆ పార్టీ నేషనల్ కోఆర్డినేటర్ రాంజీ గౌతమ్, పార్టీ రాష్ట్ర మాజీ ఇన్ చార్జి సీతారామ్ కు ఘోర పరాభవం ఎదురైంది. తాము ఐదేళ్లుగా పార్టీ కోసం క్షేత్ర స్థాయిలో ఎంతగానో కష్టపడ్డామని, కానీ వాళ్లు పార్టీకి వ్యతిరేకంగా పని చేశారని కార్యకర్తలు మండిపడ్డారు. బీఎస్పీ కోసం ఏళ్లుగా పని చేసిన వాళ్లను వదిలేసి.. చివరి నిమిషంలో బీజేపీ, కాంగ్రెస్ నుంచి వచ్చినవారికి కోట్ల రూపాయలు తీసుకుని టికెట్లు అమ్ముకున్నారని ఆరోపించారు.

ఇది వరకే తాము వేర్వేరు పద్ధతుల్లో నిరసనలు తెలిపినా.. ఈ నాయకులు తమ గోడు పార్టీ అధినేత మాయావతి దృష్టికి తీసుకెళ్లలేదని, అందుకే ఈ పని చేశామని చెబుతున్నారు కార్యకర్తలు.

2018 డిసెంబరులో జరిగిన రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఆ ఎన్నికల్లో బీఎస్పీ కేవలం 6 స్థానాల్లో గెలిచింది. ఆరుగురు ఎమ్మెల్యేలు కూడా సెప్టెంబరులో కాంగ్రెస్ లో చేరిపోయారు. దీన్ని బీఎస్పీ కార్యకర్తలు జీర్ణించుకోలేకపోతున్నారు. పార్టీలోని కొందరు నేతలే దీనికి కారణమని అసంతృప్తితో ఉన్నారు.

ఇది కాంగ్రెస్ పని అన్న మాయావతి

బీఎస్పీ అధినేత మాయావతి రాజస్థాన్ లో జరిగిన ఘటనపై స్పందించారు. నాయకుల్ని ఇలా గాడిదపై ఊరేగించి, అవమానించడం సిగ్గు చేటు అని అన్నారు. ఈ పని వెనుక కాంగ్రెస్ పార్టీ హస్తం ఉందని ఆమె ఆరోపించారు. ఇప్పటికే తమ పార్టీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసిన కాంగ్రెస్.. ఇప్పుడు పార్టీలో సీనియర్ నేతలపై దాడులు చేయించి ఇలా అవమానించిందని  ఆగ్రహం వ్యక్తం చేశారు మాయావతి.