
హైదరాబాద్, వెలుగు : పరీక్ష పేపర్లు లీక్ చేసి, వేల కోట్లకు అమ్ముకొని 35 లక్షల మంది నిరుద్యోగుల నోట్లో టీఎస్పీఎస్సీ మట్టికొట్టిందని బీఎస్పీ స్టేట్ చీఫ్ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఫైర్ అయ్యారు. తాము అధికారంలోకి వస్తే టీఎస్పీఎస్పీ బోర్డును రద్దు చేస్తామని ప్రకటించారు. గ్రూప్ 1 ప్రిలిమినరీ ఎగ్జాంను హైకోర్టు రెండోసారి రద్దు చేస్తూ ఇచ్చిన తీర్పు టీఎస్పీఎస్సీ చైర్మన్, సభ్యులకు చెంపపెట్టులాంటిదని ఈ మేరకు శుక్రవారం ఆయన ట్వీట్ చేశారు.
టీఎస్పీఎస్సీ పేపర్ల లీకేజీ సూత్రధారులు సీఎం ఆఫీసులోనే ఉన్నారని ఆరోపించారు. గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షకు హాజరైన వారికంటే 258 ఓఎంఆర్ షీట్లు అదనంగా రావడం ఏంటని ప్రశ్నించారు. దీనిపై కమిషన్ చైర్మన్ చైర్మన్ ఇచ్చిన వివరణ అసంబద్ధంగా ఉందన్నారు. టీఎస్పీఎస్సీ చైర్మన్ జనార్దన్ రెడ్డిని, సభ్యులను ప్రభుత్వం తక్షణమే బర్తరఫ్ చేసి, కొత్త బోర్డు సభ్యులను నియమించిన తర్వాతే పరీక్షలను నిర్వహించాలని డిమాండ్ చేశారు.