రూపాయిలో 68 పైసలు ట్యాక్స్​ల నుంచే..

రూపాయిలో 68 పైసలు ట్యాక్స్​ల నుంచే..

కేంద్ర ప్రభుత్వ ఆదాయం, ఖర్చుల తీరిదీ..

న్యూఢిల్లీ: రూపాయిని యూనిట్​గా తీసుకొని కేంద్ర బడ్జెట్​ని పరిశీలిస్తే ప్రభుత్వానికి వస్తున్న ఆదాయంలోని ప్రతి 100 పైసల్లో (ఒక రూపాయిలో) 68 పైసలు డైరెక్ట్​, ఇన్​డైరెక్ట్​ ట్యాక్స్​ల నుంచే వస్తున్నట్లు గమనించొచ్చు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్​ శుక్రవారం లోక్​సభలో ప్రవేశపెట్టిన 2019–20 బడ్జెట్​ ఈ విషయాన్నే చెబుతోంది. అప్పులతోపాటు అదర్​ లయబిలిటీస్ ​ద్వారా 20 పైసలు ఖజానాకు చేరుతున్నాయి. మిగతా 12 పైసల్లో 9 పైసలు నాన్–ట్యాక్స్ రెవెన్యూ కాగా 3 పైసలు నాన్​–డెబ్ట్ క్యాపిటల్ రిసీట్లతో వస్తున్నాయి. అన్నిటికన్నా ఎక్కువ రాబడి (21 పైసలను) కార్పొరేషన్​ ట్యాక్స్ ద్వారా వస్తోంది. దాని తర్వాతి స్థానం జీఎస్​టీదే.

గూడ్స్​ అండ్​ సర్వీసెస్ ట్యాక్స్ (జీఎస్​టీ) 19 పైసల ఆదాయం ఇస్తోంది. ప్రతి రూపాయిలో 16 పైసలను ఇన్​కం ట్యాక్స్ సమకూరుస్తోంది. యూనియన్ ఎక్సైజ్​ డ్యూటీ 8 పైసలు ఇస్తుండగా కస్టమ్స్ ​నుంచి 4 పైసలు గల్లా పెట్టెలోకి చేరుతున్నాయి. ఇక, ఖర్చుల విషయానికి వస్తే ట్యాక్సులు, డ్యూటీస్​లో రాష్ట్రాలకు ఇవ్వాల్సిన షేరే అన్నిటికన్నా ఎక్కువ. మొత్తం ఖర్చులో దీని వాటా 23 పైసలు. ఆ తర్వాత.. అప్పులకు చెల్లించాల్సిన వడ్డీలది (18 పైసలు) రెండో స్థానం. డిఫెన్స్​కి గతేడాది మాదిరిగానే ఈసారీ 9 పైసలే కేటాయించారు. సెంట్రల్ సెక్టార్ స్కీమ్​లకు 13 పైసలు, సెంట్రల్లీ–స్పాన్సర్డ్​ స్కీమ్​లకు 9 పైసలు ఖర్చు చేస్తారు. ఫైనాన్స్​కమిషన్ సూచించే కార్యక్రమాలతోపాటు ఇతర ట్రాన్స్​ఫర్​ల కోసం 7 పైసలు; సబ్సిడీలకు 8 పైసలు, పెన్షన్లకు 5 పైసలు, వేరే ఖర్చులకు 8 పైసలు ఇస్తారు.