ముంబయి–అహ్మదాబాద్ మధ్య బుల్లెట్ ట్రైన్ నెట్ వర్క్ పనులు చేపట్టిన కేంద్ర సర్కారు.. ఇతర సిటీలకు దాన్ని విస్తరించేందుకు స్టడీ చేస్తున్నట్లు తెలిపింది. రైల్వే శాఖ సహాయ మంత్రి సురేశ్ అంగడి శుక్రవారం రాజ్యసభకు ఈ విషయాన్ని తెలిపారు. ఢిల్లీ–కోల్ కతా, ఢిల్లీ– ముంబయి నగరాల మధ్య బుల్లెట్ ట్రైన్ సేవలు అందించేందుకు సాధ్యాసాధ్యాలపై పూర్తిస్థాయిలో స్టడీ చేస్తున్నట్లు క్వశ్చన్ అవర్ లో వెల్లడించారు. ముంబయి–అహ్మదాబాద్ మధ్య 508 కిలోమీటర్ల మేర నిర్మించే బుల్లెట్ ట్రైన్ రూట్ ను 2023లో పూర్తి చేసేందుకు టార్గెట్ పెట్టుకున్నట్లు చెప్పారు. దీనికి రూ.1.08 లక్షల కోట్లు ఖర్చవుతుందన్నారు.
జపాన్ ప్రభుత్వం ఫైనాన్షియల్, టెక్నికల్ సాయం అందిస్తున్నట్లు తెలిపారు. ఈ ఏడాది జూన్ వరకు రూ.3,226.8 కోట్లు ఖర్చు చేశామన్నారు. ముంబయి అహ్మదాబాద్ బుల్లెట్ ట్రైన్ లో 36 వేల మంది ప్రయాణించొచ్చని, టిక్కెట్ రేటు రూ.3 వేలు ఉంటుందన్నారు. గుజరాత్ లో 297 గ్రామాల్లో 97 శాతం మంది రైతులు భూసేకరణకు ఒప్పుకున్నట్లు చెప్పారు. మహారాష్ట్రలో కొన్ని చోట్ల సమస్య ఉందని, త్వరలో అది పరిష్కారమవుతుందన్నారు.
బుల్లెట్ ట్రైన్ రూట్ తో మాంగ్రూవ్స్ అడవులపై ఎక్కువ ప్రభావం పడకుండా జాగ్రత్తలు తీసుకున్నట్లు చెప్పారు. సముద్రంలో ఏడు కిలోమీటర్ల టన్నెల్ తోపాటు మొత్తం 21 కిలోమీటర్ల టన్నెల్ నిర్మిస్తున్నామన్నారు. చైనాలో 1964లోనే బుల్లెట్ ట్రైన్ సేవలు ప్రారంభించారని, ప్రస్తుతం ఆ దేశంలో 20 వేల కిలోమీటర్ల నెట్ వర్క్ ఉందన్నారు. పొరుగు దేశాల్లో గంటకు 400 కిలోమీటర్ల వేగంతో రైళ్లు నడుస్తుంటే మన దేశంలో గంటకు వంద కిలోమీటర్ల వేగంతో రైళ్లు నడుస్తున్నాయని లిఖితపూర్వక సమాధానంలో చెప్పారు.

