నూర్పిడి ఖర్చులు కూడా రాలేదని .. మిగిలిన సన్నరకం వరిపంటను తగలబెట్టాడు

నూర్పిడి ఖర్చులు కూడా రాలేదని .. మిగిలిన సన్నరకం వరిపంటను తగలబెట్టాడు

నిజామాబాద్ జిల్లా: తీవ్రంగా నష్టం వచ్చిందని సన్న రకం వరిపంటను తగలబెట్టాడు ఓ రైతు. ఇందల్వాయి మండలం, సిర్నాపల్లి గ్రామానికి చెందిన రైతు మంగళవారం ఎకరం సన్నరకం వరిపంటకు నిప్పంటించి తెలిపాడు.  సన్నరకం వరిలో దోమపోటుతో రైతులు తీవ్రంగా నష్టపోయారన్నాడు. ఎకరానికి రూ.19వేలకు పైగా పురుగు మందులు వాడినా తగ్గలేదని వాపోయాడు. ఈర లక్ష్మీనారాయణ లాక్ డౌన్ సమయంలో ఖతర్ దేశం నుంచి కూతురు పెళ్లి కోసం స్వగ్రామం వచ్చాడు. పెళ్లి తర్వాత అక్కడికి వెళ్లే మార్గం లేక తనకున్న 2.5ఎకరాల్లో ప్రభుత్వ సూచనతో సన్నాలు సాగు చేశాడు. పంట బాగోస్తుందని అనుకునే లోపు దోమ దాడి చేసిందని.. దాదాపు రూ.20వేలు ఖర్చు చేసి 3 దపాలుగా పురుగు మందులు పిచికారీ చేశానని తెలిపాడు.

అయినా కట్టడి కాకపోవడంతో యంత్రం సహాయంతో సోమవారం1.5ఎకరాలు నూర్పిడి చేస్తే, 15బస్తాల నాసిరకం ధాన్యం వచ్చిందని ఆవేదనతో చెప్పాడు. ఈ పంట నూర్పిడి కి 3.5 గంటల సమయం పట్టిందని, ఒక్కో గంటకు రూ.1800 చొప్పున రూ.6300 ఖర్చు వచ్చిందని వాపోయాడు. ఇంత చేస్తే ధాన్యంలో తేమ లేదని, బియ్యం రావడం లేదని కొనుగోలు కేంద్రంలో తూకం వేయడం లేదన్నాడు. గత్యంతరం లేక మిగిలిన ఎకరం పంటకు నిప్పు పెట్టినట్లు తెలిపాడు. అప్పుల్లో ఉన్న తమను ప్రభుత్వమే అదుకోవాలంటూ ధీనంగా వేడుకున్నాడు రైతు అక్ష్మీనారాయణ.