దమ్ముంటే మీ ఎంపీలతో రాజీనామా చేయించు.. సీఎం రేవంత్కు బీజేఎల్పీ నేత ఏలేటి సవాల్

దమ్ముంటే మీ ఎంపీలతో రాజీనామా చేయించు.. సీఎం రేవంత్కు బీజేఎల్పీ నేత ఏలేటి సవాల్
  •     రాహుల్ కళ్లలో పడేందుకే డ్రామాలాడుతున్నారు
  •     ఎంఐఎం మెప్పు కోసమే సర్​పై రాద్ధాంతం చేస్తున్నారని ఫైర్

హైదరాబాద్, వెలుగు:  సీఎం రేవంత్  రెడ్డికి దమ్ముంటే, కాంగ్రెస్  పార్టీకి చెందిన 8 మంది ఎంపీలతో రాజీనామా చేయించాలని బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి సవాల్  విసిరారు. వారితో రాజీనామా చేయించాక ఎన్నికలకు వెళ్దామని, అప్పుడు జనం ఎవరి పక్షాన ఉన్నారో తేలిపోతుందన్నారు. రేవంత్  తన పదవిని కాపాడుకునేందుకు, రాహుల్ గాంధీకి దగ్గరయ్యేందుకే కేంద్రంపై విషం చిమ్ముతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘వీబీ జీ రామ్ జీ ’ చట్టం ఉపాధి హామీ పథకాన్ని బలోపేతం చేస్తుందని, అలాంటి చట్టాన్ని తప్పుపట్టడం అవివేకమన్నారు. 

గురువారం నాంపల్లిలోని బీజేపీ స్టేట్ ఆఫీసులో మీడియాతో ఆయన మాట్లాడారు. ‘‘బీజేపీని ‘బ్రిటిష్ జనతా పార్టీ’ అని విమర్శించడానికి రేవంత్ రెడ్డికి సిగ్గుండాలి. బీజేపీ పేరులోనే భారతీయత ఉంది. ఇండియన్  నేషనల్  కాంగ్రెస్ (ఐఎన్‌‌‌‌సీ) ని స్థాపించిందే ఏఓ హ్యూమ్  అనే రిటైర్డ్  బ్రిటీష్  అధికారి. కాంగ్రెస్  పేరులో భారతీయత లేదు. అది బ్రిటీషోళ్లు పెట్టిన పార్టీ. ఐఎన్‌‌‌‌సీ  ఇపుడు ఇస్లామిక్  నేషనల్ కాంగ్రెస్ గా మారింది. 

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక టైంలో రేవంత్ రెడ్డే స్వయంగా ‘‘కాంగ్రెస్  అంటేనే ముస్లింలు.. ముస్లింలు అంటేనే కాంగ్రెస్’’ అని చెప్పారు” అని ఏలేటి వ్యాఖ్యానించారు. ఎన్నికల సంఘం ఓటర్ల జాబితాను ప్రక్షాళన చేయడం.. దేశంలో ఎప్పుడూ జరిగే రొటీన్  ప్రక్రియేనని ఆయన వెల్లడించారు. ఇదేదో దేశంలోనే తొలిసారి జరుగుతున్నట్టు సీఎం రేవంత్  రాద్ధాంతం చేస్తున్నారని విమర్శించారు. ఎంఐఎం మెప్పు కోసమే సర్  ప్రక్రియపై రాద్ధాంతం చేస్తున్నారని ఆయన ఫైర్  అయ్యారు.