హైదరాబాద్, వెలుగు: మహాత్మా జ్యోతిబా పూలే తెలంగాణ బీసీ గురుకుల విద్యాసంస్థల సొసైటీ పరిధిలో 2026–27 అకడమిక్ ఇయర్‌లో డిగ్రీ అడ్మిషన్ల కోసం సోమవారం నుంచి అప్లై చేసుకోవాలని సంస్థ సెక్రెటరీ సైదులు ఆదివారం ఒక ప్రకటనలో సూచించారు. రాష్ట్ర వ్యాప్తంగా 30 డిగ్రీ కాలేజీలు ఉండగా.. రెగ్యులర్ కోర్సులు బీఎస్సీ, బీకాం, బీఏ, బీఎస్సీతోపాటు ఫిజికల్, లైఫ్ సైన్సెస్, బీబీఏ, బీఎఫ్‌టీ, యానిమేషన్, వీఎఫ్ఎక్స్ వంటి కోర్సుల్లో 9,260 సీట్లు ఉన్నాయన్నారు. స్టూడెంట్స్ కు ఉచిత వసతితోపాటు నాణ్యమైన విద్య అందిస్తున్నామని, కోర్సు పూర్తయ్యాక ప్లేస్ మెంట్స్కు అవకాశం ఉంటుందని తెలిపారు.
డిగ్రీ ఫస్టియర్ నుంచి ప్రభుత్వ పోటీ పరీక్షలకు శిక్షణ ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. బీసీ గురుకుల కాలేజీల్లో ఇంటర్ పూర్తి చేసిన విద్యార్థులు తమ ప్రిన్సిపాల్ ద్వారా డిగ్రీ కోర్సులకు దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఇతర విద్యాసంస్థల్లో ఇంటర్మీడియట్ చదివిన వారు ఎంజేపీటీ బీసీడబ్ల్యూ రెసిడెన్షియల్ డిగ్రీ కళాశాలల్లో మొదటి సంవత్సరం(ఇంగ్లీష్ మీడియం)లో అడ్మిషన్కోసం mjptbcwreis.telangana.gov.in లేదా https://mjptbcadmissions.org/MJP-Degree/ వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. వచ్చే నెల 10వ తేదీ వరకు దరఖాస్తుకు అవకాశం ఉందని పేర్కొన్నారు.

