రంగారెడ్డి జిల్లా కొంగరకలాన్కలెక్టరేట్ ఔట్‌‌సోర్సింగ్ ఉద్యోగి సూసైడ్..ఆలస్యంగా వెలుగులోకి ఘటన

రంగారెడ్డి జిల్లా కొంగరకలాన్కలెక్టరేట్  ఔట్‌‌సోర్సింగ్ ఉద్యోగి సూసైడ్..ఆలస్యంగా వెలుగులోకి ఘటన
  • ఉన్నతాధికారి వేధింపులే కారణమని కుటుంబసభ్యుల ఫిర్యాదు

ఇబ్రహీంపట్నం, వెలుగు: ఓ ఔట్​సోర్సింగ్ ఉద్యోగి సూసైడ్​చేసుకోగా.. ఉన్నతాధికారి వేధింపులే కారణమని మృతుడి కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటన గురువారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. 

రంగారెడ్డి జిల్లా కొంగరకలాన్​కలెక్టరేట్​లోని జిల్లా గిరిజన అభివృద్ధి శాఖ కార్యాలయంలో వాడ్త్య శ్రీధర్ బాబు(39) ఔట్‌‌సోర్సింగ్‌‌ విధానంలో డేటా ఎంట్రీ ఆపరేటర్ గా పని చేస్తున్నాడు. భార్య సరోజ, ఇద్దరు కూతుళ్లు, ఒక కుమారుడితో కలిసి తుర్కయంజాల్​లోని శ్రీరాంనగర్​కాలనీలో నివాసం ఉంటున్నాడు. 

ఈ నెల 1న కూతురి కాలేజీ అడ్మిషన్ కోసం ఉన్నతాధికారి అనుమతితో త్వరగా ఇంటికి వచ్చాడు. ఆ తర్వాత కొద్దిసేపటికే అదే శాఖకు చెందిన లోన్ ఇన్‌‌స్పెక్టర్ శ్రీనివాస్ నాయుడు నుంచి శ్రీధర్​బాబుకు ఫోన్ వచ్చింది. ఫోన్ మాట్లాడిన వెంటనే గదిలోకి వెళ్లి ఫ్యాన్‌‌కు ఉరేసుకున్నాడు. 

కుటుంబసభ్యులు ఆస్పత్రికి తరలించేలోపే మృతిచెందాడు. లోన్ ఇన్‌‌స్పెక్టర్ పదేపదే ఫోన్​చేస్తూ వేధించడం వల్లే తన భర్త ఆత్మహత్య చేసుకున్నాడని మృతుడి భార్య గురువారం ఆదిభట్ల పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు వారు పేర్కొన్నారు.