 
                                    - సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జి రంజనా ప్రకాశ్ దేశాయ్ అధ్యక్షతన ఏర్పాటు
- టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్‌ను ఆమోదించిన మంత్రివర్గం
- వచ్చే ఏడాది జనవరి 1 నుంచి అమల్లోకి వచ్చే చాన్స్
- 18 నెలల్లో కేంద్రానికి సిఫారసులు ఇవ్వనున్న సంఘం
- కోటి 19 లక్షల మంది ఉద్యోగులు, పెన్షనర్లకు ప్రయోజనం
- 2025-26 రబీ సీజన్‌లో ఎరువులపై రూ. 37వేల కోట్ల సబ్సిడీకి ఆమోదం
న్యూఢిల్లీ, వెలుగు: కేంద్రప్రభుత్వ ఉద్యోగులు, పింఛనర్లకు వేతనాలు, పింఛన్ పెంచేలా 8 వ వేతన సంఘం (పే కమిషన్) ఏర్పాటుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. అలాగే, 2025–26 రబీ సీజన్‌కుగానూ ఎరువులపై రూ. 37, 952 కోట్ల సబ్సిడీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మంగళవారం ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన నిర్వహించిన కేంద్ర కేబినెట్భేటీలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అనంతరం నేషనల్ మీడియా సెంటర్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ మీడియాకు వివరాలు వెల్లడించారు.
మంత్రి వర్గ సమావేశంలో 8 వ వేతన సంఘం నిబంధనలకు ఆమోదం తెలిపినట్లు చెప్పారు. ‘‘కమిషన్‌లో ఒక చైర్‌పర్సన్, ఒక సభ్యుడు (పార్ట్ టైం) , ఒక సభ్య-కార్యదర్శి ఉంటారు. 8వ వేతన సంఘం చైర్ పర్సన్‌గా రిటైర్డ్ జడ్జి జస్టిస్ రంజనా ప్రకాశ్ దేశాయ్, పార్ట్ టైం సభ్యుడిగా ఐఐఎం, బెంగళూరు ప్రొఫెసర్ పులక్ ఘోష్, సభ్య కార్యదర్శిగా పెట్రోలియం శాఖ కార్యదర్శి పంకజ్ జైన్‌ను నియమించారు” అని వివరించారు. 2026 జనవరి 1నుంచి ఈ కమిషన్అమల్లోకి వచ్చే అవకాశం ఉన్నదని, 18 నెలల్లోపు కేంద్ర ప్రభుత్వానికి ఈ కమిటీ సిఫారసులు చేస్తుందన్నారు.
దీంతో కేంద్ర పరిధిలోని 50 లక్షల మంది ఉద్యోగులు, 69 లక్షల మంది పింఛనర్లకు ప్రయోజనం చేకూరనున్నట్టు వెల్లడించారు. కాగా, ప్రస్తుత 7వ వేతన సవరణ సంఘం కాల పరిమితి వచ్చే ఏడాదితో ముగియనున్నది. ఈ నేపథ్యంలో 2025 జనవరిలో 8 వ వేతన సంఘం ఏర్పాటును కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. కేంద్ర మంత్రులు, మంత్రిత్వ విభాగాల సిబ్బందితో విస్తృతస్థాయి సమీక్షలు నిర్వహించి.. ముగ్గురు సభ్యులతో ఈ కమిషన్‌ను ఏర్పాటు చేసింది. కాగా, రంజనా ప్రకాశ్ దేశాయ్ ప్రస్తుతం ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చైర్‌పర్సన్‌గా ఉన్నారు. గతంలో జమ్మూ కాశ్మీర్ కేంద్రపాలిత ప్రాంతం కోసం డీలిమిటేషన్ కమిషన్, ఉత్తరాఖండ్ యూనిఫాం సివిల్ కోడ్ (యూసీసీ) రూపొందించే నిపుణుల కమిటీకి నేతృత్వం వహించారు.
ఎరువులపై సబ్సిడీకి ఆమోదం..
2025–26 రబీ సీజన్ కోసం ఫాస్పరస్, పొటాషియం (పీ అండ్ కే) ఎరువులపై పోషక ఆధారిత సబ్సిడీ (ఎన్‌బీసీ) రేట్లను నిర్ణయించడానికి ఎరువుల శాఖ చేసిన ప్రతిపాదనలను కేబినెట్ ఆమోదించింది. ఇందుకోసం రూ 37, 952.29 కోట్లు కేటాయించింది. న్యూట్రిషన్ బేస్డ్ సబ్సిడీ పేరుతో నైట్రోజన్, ఫాస్పరస్, పొటాష్, సల్ఫర్ల (ఎన్‌పీకేఎస్)కు కేంద్ర సబ్సిడీ అందించనున్నది. నైట్రోజన్‌పై కిలోకు రూ. 43.02, ఫాస్పరస్‌పై కిలోకు రూ. 47.96, పొటాష్ పై కిలో కు రూ. 2.38, సల్ఫర్‌పై కిలో కు రూ 2.87 సబ్సిబీ కల్పిస్తున్నట్టు వెల్లడించింది. రబీ సీజన్‌లో డై అమ్మోనియం ఫాస్పేట్ (డీఏపీ), మోనో అమ్మోనియం ఫాస్పేట్ (ఎంఏపీ), మ్యూరియేట్ ఆఫ్ పొటాష్ (ఎంవోపీ), ట్రిపుల్ సూపర్ ఫాస్పేట్ (టీఎస్‌పీ), 3 గ్రేడ్స్ ఆఫ్ సింగిల్ సూపర్ ఫాస్పేట్ (ఎస్ఎస్‌పీ), పొటాష్ డెరైవ్డ్ మొలాసెస్ (పీడీఎం), అమ్మోనియం సల్ఫేట్ (ఏఎస్) లాంటి దాదాపు 28 ఎన్‌పీకేఎస్ కాంప్లెక్స్ ఫర్టిలైజర్స్‌ను ఉత్పత్తి చేసే కంపెనీలకు న్యూట్రియెంట్ బేస్డ్ సబ్సిడీ అమలు చేయాలని నిర్ణయించింది.

 
         
                     
                     
                    