రేపు రాహుల్ గాంధీతో రాష్ట్ర కాంగ్రెస్ నేతల భేటీ

రేపు రాహుల్ గాంధీతో రాష్ట్ర కాంగ్రెస్ నేతల భేటీ

హైదరాబాద్, వెలుగు: అసంతృప్తులు, అంతర్గత లొల్లులతో కాంగ్రెస్ ​రాష్ట్ర రాజకీయం ఆసక్తిగా మారింది. రాహుల్‌‌ గాంధీతో రాష్ట్ర నేతలు ఢిల్లీలో సోమవారం భేటీ కానున్నారు. ఈ మీటింగ్‌‌కు పీసీసీ నేతలతో పాటు పది మంది మాజీ మంత్రులు, సీనియర్లకు పిలుపు అందినట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మార్చి 30న జరిగిన మీటింగ్‌‌లో పార్టీ సభ్యత్వాలపై మాత్రమే చర్చ జరగ్గా.. ఈసారి తెలంగాణలో పార్టీ పరిస్థితి, వచ్చే ఎన్నికల్లో అమలు చేయాల్సిన వ్యూహాలపై చర్చించనున్నట్టు తెలిసింది. పార్టీలో అసంతృప్తులు, భవిష్యత్ కార్యాచరణ, కేసీఆర్‌‌‌‌ సర్కార్‌‌‌‌ తీరుపై చర్చించే అవకాశం ఉన్నట్టు సమాచారం.

పీసీసీ చీఫ్ రేవంత్‌‌రెడ్డిపై ఫిర్యాదు చేయడానికి కొందరు సీనియర్లు రెడీ అవుతున్నారు. రేవంత్‌‌పై కోమటిరెడ్డి వెంకటరెడ్డి, రాజగోపాల్‌‌రెడ్డి, జగ్గారెడ్డి, వీహెచ్‌‌ బహిరంగంగానే విమర్శలు చేస్తున్నారు. ఉత్తమ్‌‌, సీఎల్పీ నేత భట్టి కూడా రేవంత్‌‌ వైఖరిపై అసంతృప్తితో ఉన్నారు. లాయలిస్టుల ఫోరం పేరుతో పార్టీ సీనియర్లు పలుమార్లు భేటీ అయ్యారు. పొన్నాల లక్ష్మయ్య, మర్రి శశిధర్‌‌‌‌ రెడ్డి ఇంట్లో మీటింగ్‌‌లు కూడా జరిగాయి. 
రాష్ట్రంలో కాంగ్రెస్ పరిస్థితిపై సర్వే..
తెలంగాణలో పార్టీ బలాబలాలు, లీడర్ల పనితీరు, జనంలో ఉన్న అభిప్రాయాలను తెలుసుకునేందుకు ఎలక్షన్ ​స్ట్రాటజిస్ట్ సునీల్​ కనుగోలును కాంగ్రెస్ రంగంలోకి దింపింది. గతంలో ప్రశాంత్​కిషోర్​ టీమ్‌‌లో పని చేసిన అనుభవమున్న సునీల్​.. ఇటీవలే రాష్ట్రంలో కాంగ్రెస్‌‌ పరిస్థితిపై సర్వే చేసి  ప్రాథమిక రిపోర్టును రాహుల్‌‌కు అందించినట్లు తెలిసింది. రేవంత్ నియామకం తర్వాత  పార్టీలో చోటు చేసుకున్న మార్పులు, రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ ​విజయావకాశాలు తదితర విషయాలను రిపోర్టులో పేర్కొన్నట్టు సమాచారం.