బర్త్‌‌ డేకు పిలిచి.. మత్తు మందు కలిపి

బర్త్‌‌ డేకు పిలిచి.. మత్తు మందు కలిపి

వరంగల్ ఘటనలో వీడుతున్న మిస్టరీ

నిందితుడు నేరం ఒప్పుకున్నట్లు సమాచారం

వరంగల్, వెలుగు: వరంగల్‌‌ గొర్రెకుంటలో 9 మంది బావిలో శవమై తేలిన ఘటనలో మిస్టరీ వీడుతోంది. నిందితుల్లో ఒకరైన బీహార్‌‌కు చెందిన సంజయ్‌‌ యాదవ్‌‌ నేరం అంగీకరించినట్టు తెలుస్తోంది. కుటుంబ గొడవలతో మక్సూదే అందరినీ చంపి బావిలో పడేశాడని తొలుత అనుమానించినా ఆదివారం సంజయ్ నేరం ఒప్పుకున్నట్టు సమాచారం. ఆఫీసర్లు మాత్రం కన్ఫమ్‌‌ చేయలేదు. గొర్రెకుంట బావిలో గురువారం మహ్మద్ మక్సూద్​(56), ఆయన భార్య నిశా (46), కూతురు బుస్రా(22), మూడేళ్ల మనవడు బబ్లూ మృతదేహాలు బయటపడ్డాయి. మక్సూద్‌‌ కొడుకులు షాబాద్ ఆలం (21), సోహైల్ ఆలం (19)తో పాటు బీహార్‌‌కు చెందిన శ్రీరామ్‌‌​(21), శ్యామ్‌‌ (21) జాడ కనిపించకపోవడంతో వాళ్లది హత్యేనని భావించారు. కానీ శుక్రవారం ఈ నలుగురి డెడ్ బాడీలు, డ్రైవర్ షకీల్ మృతదేహం బావిలో తేలడంతో సంచలనమైంది.

నిద్ర మాత్రలు కలిపి?

తన బర్త్‌‌ డే ఉందని చెప్పి గత బుధవారం 9 మందిని సాయినాథ్ ట్రేడర్స్‌‌కు సంజయ్ యాదవ్ పిలిపించినట్లు ప్రచారం జరుగుతోంది. మక్సూద్ కూతురు బుస్రాతో ఆయనకు వివాహేతర సంబంధం ఉందని, ఇతర ఆర్థిక లావాదేవీల విషయంలో ఇదివరకే గొడవ జరిగినట్లు తెలిసింది. దీంతో బర్త్‌‌ డే పేరుతో అందరినీ పిలిచినట్లు చెబుతున్నారు. వారితో పాటు తన అన్ని విషయాలు తెలిసిన షకీల్‌‌ను మక్సూద్ ద్వారా పిలిపించారంటున్నారు. తర్వాత అందరికీ కూల్ డ్రింక్స్‌‌లో నిద్ర మాత్రలు కలిపి ఇచ్చి స్పృహ కోల్పోయాక గోనెసంచిలో ఈడ్చుకెళ్లి పక్కనున్న బావిలో పడేసినట్లు పోలీసులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. సంఘటన టైమ్‌‌లో సంజయ్‌‌తో పాటు ఇంకొందరూ ఫ్రెండ్స్‌‌ కూడా ఉన్నట్లు సమాచారం. బుస్రాతో సన్నిహితంగా మెలిగిన మిద్దెపాక యాకుబ్ హస్తం కూడా ఉందని ప్రచారం జరుగుతోంది. సంజయ్‌‌ పాత్రపై సోమవారం స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

ప్రాణం ఉండగానే బావిలో పడేసి..

మృతదేహాలపై గీరుకుపోయిన గాయాలున్నట్టు పోస్టుమార్టం తర్వాత డాక్టర్లు చెప్పారు. ఈడ్చుకెళ్తుంటే అయినట్లు గాయాలున్నాయన్నారు. అందరినీ ప్రాణం ఉండగానే బావిలో పడేసి ఉంటారని, సామూహిక ఆత్మహత్యలు కావని గుర్తించారు. మృతుల ఊపిరితిత్తుల్లోకి నీళ్లు వెళ్లినట్టు పోస్టుమార్టంలో గుర్తించారు. బతికుండగానే బావిలో పడేస్తే ఊపిరితిత్తుల్లోకి నీళ్లు పోయే అవకాశం ఉంటుంది. కాబట్టి మత్తు మందు కలిపి అపస్మారక స్థితిలోకి వెళ్లాకే బావిలో పడేసి ఉంటారని చెబుతున్నారు. పోస్టుమార్టం టైమ్‌‌లో గమనించిన విషయాల ప్రకారం మత్తు పదార్థాలు, విష ప్రయోగం జరిగి ఉంటుందనే అనుమానంతో మృతదేహాల ఊపిరితిత్తులు, కిడ్నీలు, పొట్ట భాగాలను ఫోరెన్సిక్ టెస్టు కోసం పంపారు. సాయినాథ్ ట్రేడర్స్‌‌లోని ఇంట్లో ఫుడ్, డ్రింక్స్, బియ్యం తదితర శాంపిల్స్‌‌ను కూడా ల్యాబ్‌‌కు పంపారు.

For More News..

మరో ఐదురోజులు వడగాడ్పులు

నారుమళ్లకు ఎస్సారెస్పీ నీళ్లే!