పురుషులు గర్భం దాల్చే ఛాన్స్ ఉందా..? అమెరికా సెనేట్లో భారత సంతతి డాక్టర్కు వింత ప్రశ్న

పురుషులు గర్భం దాల్చే ఛాన్స్ ఉందా..? అమెరికా సెనేట్లో భారత సంతతి డాక్టర్కు వింత ప్రశ్న

అమెరికా సెనేట్ లో జరిగిన చర్చ వివాదాస్పదంగా మారింది. భారత సంతతి డాక్టర్ కు సెనేటర్ వేసిన ప్రశ్నలు ఉద్రిక్తతకు, సోషల్ మీడియాలో వివాదానికి దారి తీశాయి. పురుషులు గర్భం దాల్చగలరా.. అని సెనేటర్ అడిగిన ప్రశ్నపై  చర్చ నడుస్తోంది. మందుల ద్వారా జరిగే అబార్షన్ నుంచి మహిళలను కాపాడటం.. అనే అంశంపై సెనేట్ లో జరుగుతున్న చర్చలో భారత సంతతి గైనకాలజిస్ట్, డాక్టర్ నిషా వర్మ హాజరయ్యారు. ఈ సందర్భంగా సెనేటర్ కు, డాక్టర్ కు మధ్య జరిగిన వాగ్వాదం ప్రస్తుతం వైరల్ గా మారింది. 

మెడికేషన్ ద్వారా జరిగే అబార్షన్ సురక్షితమేనని.. దశాబ్దాలుగా రీసెర్చ్ చేసి ప్రిస్క్రైబ్ చేస్తున్నందున.. వాటి నుంచి ఎలాంటి హామీ లేదని ఆమె సెనేట్ లో పేర్కొన్నారు. రాజకీయ ఆధారిత నిర్బంధాల కారణంగా పేషెంట్స్ కు నష్టం కలిగే అవకాశం ఉందని ఆమె వాదించారు. ఈ మందులపై దాదాపు వందకు పైగా అధ్యయనాలు జరిగాయని.. 2000 సంవత్సరంలో అనుమతి లభించిన నాటి నుంచి దాదాపు 75 లక్షల అమెరికన్లు వినియోగించి ఉంటారని ఆమె ప్రసంగంలో పేర్కొన్నారు. 

ఈ సందర్భంగా రిపబ్లికన్ సెనేటర్ జోష్ హాలే కల్పించుకుని అడిగిన ప్రశ్నలతో సెనేట్ వేడెక్కింది. పురుషులు ప్రగ్నెంట్ అవుతారా..? అంటూ కాస్త వెటకారంగా అడగటంతో చర్చ ఉద్రిక్తతకు దారితీసింది. ఈ ప్రశ్నకు ఆమె నేరుగా సమాదానం చెప్పకుండా.. లింగ గుర్తింపు లేని వారికి కూడా వైద్యం చేసినట్లు చెప్పారు. మహిళలుగా గుర్తించని వారిని కూడా ట్రీట్ చేసినట్లు చెప్పారు. అంటే లింగ మార్పిడి చేసుకుని పురుషులుగా మారిన మహిళలను కూడా ట్రీట్ చేసినట్లు ఆమె పరోక్షంగా చెప్పారు. 

దీనికి హాలే స్పందిస్తూ.. సూటిగా సమాధానం చెప్పాలని ప్రశ్నించాడు. ఇది సైన్స్ ఆధారాల గురించి అడుగుతున్న ప్రశ్న అని.. జీవసంబంధిత నిజాన్ని నిరూపించే ప్రశ్న అని.. సూటిగా చెప్పాలని డిమాండ్ చేశాడు. సైన్స్, ఎవిడెన్స్ మెడిసిన్ కు మార్గనిర్దేశం చేయాలని ఆమె అన్నారు. కానీ ఇది రాజకీయ ప్రేరేపిత వస్తువు కాకూడదని ఆమె చెప్పారు. 

దీనికి ఆగ్రహించిన సెనేటర్ హాలే.. మహిళలు గర్భం దాల్చుతారు.. పురుషులు కాదు.. ఈ విషయాన్ని చెప్పడానికి ఎందుకు నిరాకరిస్తున్నారని ప్రశ్నించాడు. అదేవిధంగా లింగ మార్పిడి చేసుకున్న పురుషులు ప్రగ్నెంట్ కాలేరు అని ఆమె చెప్పలేకపోతే.. మెడిసిన్ విషయంలో ఆమె వాదనను ఎలా స్వీకరించాలని అన్నాడు. అబార్షన్ కు వినియోగించే మందులు 11 శాతం కేసులలో ఆరోగ్య సమస్యలు తెస్తున్నాయని ఈ సందర్భంగా వాదించాడు.  నేను సైన్స్ వ్యక్తిని.. పేషెంట్స్ అనుభవాలను ఇక్కడ ప్రజెంట్ చేయడానికి వచ్చాను. రాజకీయ, ప్రేరేపిత ప్రశ్నలు లక్ష్యాలను చేరవు అని ఆమె బదులిచ్చారు.