టెర్రరిస్టులకు కెనడా అడ్డా: అరిందమ్

టెర్రరిస్టులకు కెనడా అడ్డా: అరిందమ్

న్యూఢిల్లీ: టెర్రరిస్టులకు కెనడా స్వర్గధామంగా మారుతున్నదని మన విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి అరిందమ్ బాగ్చీ ఫైర్ అయ్యారు. ఖలిస్తానీ టైగర్ ఫోర్స్ చీఫ్ హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య తర్వాత  కెనడా-, భారత్ మధ్య ఉద్రిక్త పరిస్థితులపై గురువారం ఆయన మీడియాతో  మాట్లాడారు. కెనడాలోని ఖలిస్తాన్ టెర్రరిస్టులకు పాక్ నుంచి నిధులు అందుతున్నాయని అన్నారు. ఖలిస్తానీ టెర్రరిస్టులుగా ఆరోపణలున్న 25 మందిపై చర్యలు తీసుకోవాలని, వారిని అప్పగించాలని ఎన్నోసార్లు కోరినా కెనడా స్పందించలేదన్నారు.  హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యకు సంబంధించిన వివరాలు కెనడా నుంచి తమకు ఇంకా అందలేదన్నారు.

ట్రూడో ఆరోపణలు నిరాధారం

నిజ్జర్ హత్యతో భారత ఏజెంట్లకు సంబంధం ఉందంటూ కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో  చేసిన ఆరోపణలపై బాగ్చీ  తీవ్రంగా స్పందించారు. ట్రూడో ఆరోపణలు రాజకీయ ప్రేరేపితమని పేర్కొన్నారు. ఇలాంటి నిరాధార ఆరోపణలతో  కెనడా  ఖలిస్తాన్ టెర్రరిస్టుల నుంచి తమ దృష్టిని మళ్లించే ప్రయత్నం చేస్తున్నదని చెప్పారు.  ప్రస్తుతం కెనడాలోని భారత హైకమిషన్ అండ్ కాన్సులేట్‌‌‌‌ల భద్రతకు ముప్పు ఉందన్నారు.   

కెనడా దౌత్యవేత్తలను తగ్గిస్తం

భారత్‌‌లోని కెనడా దౌత్యవేత్తలకు భద్రత కల్పిస్తున్నామని బాగ్చీ చెప్పారు.  కెనడాలోని భారత దౌత్యవేత్తలకూ  అక్కడి ప్రభుత్వం భద్రత కల్పించాలన్నారు. ఇకపై మన దేశ అంతర్గత వ్యవహారాల్లో కెనడా దౌత్యపరమైన జోక్యాన్ని వీలైనంత  తగ్గిస్తామని చెప్పారు. కెనడాలో చదువుతున్న భారతీయ విద్యార్థులంతా జాగ్రత్తగా ఉండాలని సూచించారు. స్టూడెంట్లకు ఏదైనా సమస్య ఉంటే వెంటనే భారత కాన్సులేట్‌‌ను సంప్రదించాలని పేర్కొన్నారు.