కెనడాలో ఇండియన్ బిజినెస్‌‌‌‌మెన్ హత్య

కెనడాలో ఇండియన్ బిజినెస్‌‌‌‌మెన్ హత్య
  • పంజాబీ సింగర్ ఇంటి బయట కూడా కాల్పులు  
  • తామే చేశామన్నలారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్

న్యూఢిల్లీ: కెనడాలో భారత సంతతి పారిశ్రామికవేత్త దర్శన్ సింగ్ సాహసి (68) హత్యకు గురయ్యారు. ఆయనను తామే హత్య చేశామని లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ ప్రకటించింది. ‘‘దర్శన్ సింగ్ డ్రగ్ బిజినెస్‌‌‌‌లో ఉన్నాడు. మేం డబ్బులు అడిగితే ఇవ్వలేదు. అందుకే చంపేశాం” అని గ్యాంగ్ మెంబర్ గోల్డీ ధిల్లాన్ సోషల్ మీడియాలో పోస్టు పెట్టాడు. 1991లో కెనడాకు వెళ్లి సెటిల్ అయిన దర్శన్ సింగ్.. ప్రముఖ టెక్స్‌‌‌‌టైల్ రీసైక్లింగ్ కంపెనీ కానమ్ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్. 

ప్రస్తుతం బ్రిటిష్ కొలంబియాలోని అబోట్స్‌‌‌‌ఫోర్డ్‌‌‌‌లో ఉంటున్నారు. సోమవారం ఉదయం ఇంట్లో నుంచి బయటకు వచ్చిన దర్శన్ సింగ్.. రోడ్డుపై పార్క్ చేసిన తన కారు దగ్గరికి వెళ్లాడు. ఆయన కారు ఎక్కగానే.. అప్పటికే అక్కడ వేచి చూస్తున్న షూటర్, కాల్పులు జరిపి పారిపోయాడు. ఘటనా స్థలానికి పోలీసులు వచ్చే సరికి దర్శన్ సింగ్ క్రిటికల్ కండిషన్‌‌‌‌లో ఉన్నారు. ప్రాథమిక చికిత్స అందించినప్పటికీ ఆయన ప్రాణాలు కాపాడలేకపోయారు. 

కాగా, కెనడాలోని పంజాబీ గాయకుడు చాని నట్టన్‌‌‌‌ ఇంటి బయట కూడా బిష్ణోయ్‌‌‌‌ గ్యాంగ్‌‌‌‌ కాల్పులు జరిపింది. ‘‘నట్టన్‌‌‌‌తో మాకు వ్యక్తిగతంగా ఎలాంటి శత్రుత్వం లేదు. సింగర్ సర్దార్‌‌‌‌ ఖేరాతో తిరగొద్దని చెప్పినప్పటికీ నట్టన్ వినట్లేదు. అందుకే కాల్పులు జరిపాం. ఖేరాతో కలిసి ఎవరు పని చేసినా చంపేస్తాం” అని గోల్డీ ధిల్లాన్ సోషల్ మీడియాలో పోస్టు పెట్టాడు.