కాలువల్లో చేపలు పడతారు కానీ సైకిళ్లు పట్టడం ఏంటి?!

కాలువల్లో చేపలు పడతారు కానీ సైకిళ్లు పట్టడం ఏంటి?!

కాలువల్లో చేపలు పడతారు కానీ సైకిళ్లు పట్టడం ఏంటి?! అనుకుంటున్నారా?  నిజమే మరి! ఇది జరిగేది నెదర్లాండ్స్​లో. ఆ దేశ రాజధాని ఆమ్​స్టర్​డ్యామ్​ ప్రపంచంలోని అత్యుత్తమ నగరాల్లో ఒకటి. ఆ సిటీకి ‘బైసికిల్​​ కేపిటల్​’ ‘సైక్లింగ్​ కేపిటల్​ ఆఫ్​ ది వరల్డ్​’ అనే పేర్లు కూడా ఉన్నాయి. కారణం ఏంటంటే అక్కడ సైకిళ్ల వాడకం చాలా ఎక్కువ. అక్కడ జనం కన్నా సైకిళ్లు రెండింతలు ఎక్కువగా ఉంటాయి. పర్యావరణానికి హాని చేయవని, ఆరోగ్యానికి మేలని వాటినే ఎక్కువగా వాడుతుంటారు అక్కడివాళ్లు. అయితే, ఇక్కడే ఒక చిక్కు ఉంది. అదేంటంటే.. అట్లాంటిక్​ సముద్రానికి ఆనుకొని ఉండే ఆమ్​స్టర్​డ్యామ్​లో దాదాపు 160 కాలువలు ఉన్నాయి.

వీటిలో పడవల ద్వారా రాకపోకలు కూడా జరుగుతుంటాయి. ఈ కాలువలను అప్పుడప్పుడు క్లీన్​ చేస్తుంటారు అధికారులు. ప్రొక్లెయిన్​ల లాంటి మిషన్లతో కాలువల్లో ఉన్న చెత్తాచెదారం బయటికి తీస్తుంటారు. అలా తీసేటప్పుడు ఆ మిషన్లకు చిక్కుకొని సైకిళ్లు బయటపడుతుంటాయి. అదీ ఒకటీ రెండూ కాదు. కుప్పులు కుప్పులుగా!  ఒక సర్వే ప్రకారం ఈ కాలువల నుంచి ఏటా సుమారు 15వేల సైకిళ్లు బయటికి తీస్తున్నారని తేలింది!! ఇలా కాలువల్లో సైకిళ్లు దొరకడానికి చాలా కారణాలే ఉన్నాయి. అందులో మొదటిది.. కాలువల పక్కనే ఉన్న రోడ్లపై సైకిళ్లను పార్క్​ చేయడం వల్ల పెద్ద గాలి వచ్చినప్పుడు సైకిళ్లు అందులో పడిపోతుంటాయి. అయితే, చాలా మంది తమ పాత సైకిళ్లను కావాలనే అందులో వేస్తుంటారని కూడా అధికారులు చెప్తున్నారు. కాగా, గత బుధవారం అధికారులు మిషన్​తో కాలువలోని సైకిళ్లను పడవపైకి చేర్చుతున్న వీడియో ఒకటి సోషల్​ మీడియాలో వైరల్​ అయింది.