- పోలీసులకు బాధితుల ఫిర్యాదు
- రహమత్ నగర్ లో ఘటన
జూబ్లీహిల్స్, వెలుగు: పెంపుడు కుక్క పెట్టిన పంచాయితీతో ఇరువర్గాలు గొడవకు దిగడమే కాకుండా ఆపై దాడులకు పాల్పడిన ఘటన హైదరాబాద్లో జరిగింది. యూసఫ్ గూడ పరిధి రహమత్ నగర్ లో ఉండే ఉద్యోగి నిమ్మటూరి శ్రీనాథ్, స్వప్న దంపతులు ఈనెల 8న ఉదయం పోస్టల్ బ్యాలెట్ వేసేందుకు ఇంట్లోంచి బయటకు వచ్చారు. శ్రీనాథ్ సోదరుడు మధు తలుపు తీసి వేయకపోవడంతో కుక్క బయటకు వెళ్లింది. ఆ సమయంలో ఇంటి ఎదురుగా కొత్త ఇంటిని నిర్మిస్తున్న ధనుంజయ్ అనే వ్యక్తి నిలబడి ఉండగా కుక్క వెళ్లి అరిచింది.
దీంతో శ్రీనాథ్ వెంటనే తన కుక్కను అడ్డుకోగా.. ‘మీ కుక్కను మాపై ఎందుకు రెచ్చగొడుతున్నారు.. అంటూ ధనుంజయ్తిట్టాడు. ఇదే విషయమై గతంలోనూ పీఎస్ లో కేసు నమోదైంది. మళ్లీ మంగళవారం సాయంత్రం 7 గంటలకు శ్రీనాథ్ దంపతులు, వారి మేనల్లుడు సాత్విక్ వాకింగ్ చేసేందుకు కుక్కను తీసుకుని బయటకు వచ్చారు. దీంతో ధనుంజయ్ వర్గీయులు వారిని తిడుతూ చంపుతామంటూ బెదిరించి కర్రలతో, రాడ్లతో దాడి చేశారు.
దీంతో శ్రీనాథ్ తీవ్రగాయాలపాలై అపస్మారక స్థితికి చేరుకున్నాడు. స్వప్న, సాత్విక్ లకు స్వల్ప గాయాలవగా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ధనుంజయ్ అతని వర్గీయులపై శ్రీనాథ్ సోదరుడు మధు బుధవారం పోలీసులకు కంప్లయింట్ చేయగా హత్యాయత్నం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై బాల్ రాజ్ తెలిపారు.
