పదేండ్లలో మోదీ చేసింది ఇదేగా?

పదేండ్లలో మోదీ చేసింది ఇదేగా?
  • హిందూ, ముస్లిం అని తాను అనలేదన్న ప్రధాని కామెంట్లపై ప్రియాంక ఫైర్ 
  •     మొత్తం ప్రపంచం ముందే మీరు మాట్లాడారు 
  •     ఇప్పుడు మీ స్పీచ్​లను మీరే ఇవ్వలేదంటరా?
  •     రాయ్ బరేలీ ప్రచారంలో వ్యాఖ్య

రాయ్ బరేలీ(యూపీ):  హిందూ, ముస్లిం అంటూ తాను ఎన్నడూ రాజకీయాలు చేయలేదంటూ ఓ ఇంటర్వ్యూలో ప్రధాని మోదీ చేసిన కామెంట్లపై కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ ప్రియాంకా గాంధీ వాద్రా మండిపడ్డారు. ‘‘మోదీ పదేండ్లుగా ఇదే చేస్తున్నారు. మొత్తం ప్రపంచం ముందు స్వయంగా తానే ఇచ్చిన స్పీచ్ లను ఇప్పుడు ఆయన నిరాకరించలేరు. ఆయన ఇప్పుడు సడెన్ గా మాట మార్చేసి.. తాను అలాంటి మాటలను అనలేదని ఎలా చెప్తారు?” అని ఆమె విమర్శించారు. బుధవారం యూపీలోని రాయ్ బరేలీలో కాంగ్రెస్ మాజీ చీఫ్ రాహుల్ గాంధీకి మద్దతుగా ప్రియాంక ఎన్నికల ప్రచారం నిర్వహించారు. 

ఎన్నికల సమయంలో మతాన్ని ప్రస్తావిస్తూ బీజేపీ ప్రజల దృష్టిని మరలిస్తోందని ఆరోపించారు. మత రాజకీయాల కారణంగా గత పదేండ్లలో ప్రభుత్వం ప్రజలకు జవాబుదారీగా లేదని తెలిపారు. ‘‘ప్రజల్ని మతం పేరుతో మోసగించి అధికారంలోకి రావొచ్చని బీజేపీ నేతలు గ్రహించారు. ప్రధాని మోదీ నుంచి రాయ్ బరేలీ బీజేపీ అభ్యర్థి వరకు ఆ పార్టీ నేతలంతా ప్రజల కోసం పని చేయాల్సిన అవసరం లేదని భావిస్తున్నారు. ఎన్నికల సమయంలో మతాన్ని ప్రస్తావిస్తూ ప్రజల దృష్టిని మరలించొచ్చని వారు అనుకుంటున్నారు” అని ఆమె అన్నారు. 

‘‘దేశంలో రెండు రకాల రాజకీయాలు ఉన్నాయి. నిజాయతీగా ఓటర్ల కోసం పని చేయడం ఒక రకమైన రాజకీయాలైతే.. బీజేపీ చేసేవి రెండో రకం రాజకీయాలు. బీజేపీ నేతలు భావోద్వేగాలతో ఆడుకుంటారు. మతం పేరు చెప్పి ఓట్లు అడుగుతారు. ఓటర్ల గురించి పట్టించుకోకుండా అధికారంలో కొనసాగుతారు. కాంగ్రెస్​ను అవినీతి పార్టీ అని బీజేపీ పిలుస్తుంది. కానీ, మా పార్టీ 55 ఏండ్ల పాటు అధికారంలో ఉన్నా ధనిక పార్టీగా మారలే. బీజేపీ మాత్రం పదేండ్లలోనే ప్రపంచంలోనే అత్యంత ధనిక పార్టీగా అవతరించింది” అని ప్రియాంక విమర్శించారు.