ఇండియా పరువు తీశారు.. AI సమ్మిట్ నుంచి వెళ్లిపోండి.. గల్గోటియాస్ వర్సిటికీ సీరియస్ వార్నింగ్

ఇండియా పరువు తీశారు.. AI సమ్మిట్ నుంచి వెళ్లిపోండి.. గల్గోటియాస్ వర్సిటికీ సీరియస్ వార్నింగ్

ఢిల్లీలో జరుగుతున్న ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ లో చోటుచేసుకున్న ఘటన ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. గ్రేటర్ నోయిడాకు చెందిన గల్గోటియాస్ యూనివర్సిటీ తన స్టాల్‌లో ప్రదర్శించిన ఒక 'రోబోటిక్ డాగ్' వివాదానికి కేంద్ర బిందువుగా మారింది. ఈ వ్యవహారం చిలికి చిలికి గాలివానలా మారి.. చివరకు సదస్సు నుంచి ఆ యూనివర్సిటీ స్టాల్‌ను ఖాళీ చేయాలని ప్రభుత్వం ఆదేశించే వరకూ వెళ్లింది. దీనిపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కూడా తన ఎక్స్ పోస్టులో స్పందించిన సంగతి తెలిసిందే. దీంతో డిఫెన్స్‌లో పడిన మోడీ సర్కార్ స్టాల్ ఖాళీ చేయాలంటూ హుకుం జారీ చేసినట్లు సమాచారం. 

అసలేం జరిగింది..? 
సమ్మిట్ ఎక్స్‌పోలో గల్గోటియాస్ యూనివర్సిటీ ప్రతినిధులు 'ఓరియన్' అనే పేరుతో ఒక రోబో కుక్కను ప్రదర్శించారు. యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్ నేహా సింగ్ ఒక వీడియోలో మాట్లాడుతూ.. అది తమ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో తయారైందని.. క్యాంపస్ అంతా తిరుగుతూ పర్యవేక్షణ చేస్తుందని వివరించారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు అసలు నిజాన్ని బయటపెట్టారు. అది ఆ యూనివర్సిటీ తయారు చేసింది కాదని.. చైనాకు చెందిన యూనిట్రీ రోబోటిక్స్ అనే కంపెనీ తయారు చేసిన 'Unitree Go2' అనే మోడల్ అని ఆధారాలతో సహా నిరూపించారు. దీని ధర సుమారు రూ.2లక్షల 50వేల నుండి రూ. 3 లక్షల వరకు ఉంటుందని నెటిజన్లు బయటపెట్టారు.

సోషల్ మీడియాలో రచ్చ..
నెటిజన్ల విమర్శలు ఒక ఎత్తు అయితే.. గల్గోటియాస్ యూనివర్సిటీ గతంలో తాము రూ.350 కోట్లు ఏఐ వ్యవస్థపై ఖర్చు చేశామని చేసిన ప్రకటనలను దీనికి ముడిపెట్టి ట్రోల్ చేయడం మొదలుపెట్టారు. చైనా రోబోను కొనుగోలు చేసి.. దానికి పేరు మార్చి తమ సొంత ఆవిష్కరణగా చెప్పుకోవడం దేశానికి అవమానం అంటూ నెటిజన్లు మండిపడ్డారు. ఈ వివాదం తీవ్రం కావడంతో.. అంతర్జాతీయ ప్రతినిధుల ముందు దేశ ప్రతిష్టను దెబ్బతీసేలా ప్రవర్తించారని భావించిన అధికారులు, యూనివర్సిటీని స్టాల్ ఖాళీ చేసి వెళ్లిపోవాలని ఆదేశించినట్లు తెలిసింది.

యూనివర్సిటీ క్లారిటీ.. ఆపై యూటర్న్
విమర్శలు వెల్లువెత్తడంతో గల్గోటియాస్ యూనివర్సిటీ ఒక ప్రకటన విడుదల చేసింది. తాము ఆ రోబోను తయారు చేశామని ఎప్పుడూ చెప్పలేదని, విద్యార్థులు ఏఐ ప్రోగ్రామింగ్ నేర్చుకోవడానికి, ప్రయోగాలు చేయడానికి చైనా నుండి కొన్నట్లు అందులో పేర్కొన్నారు. దీనిపై అనవసరంగా దుష్ప్రచారం చేస్తున్నారంటూ రివర్స్ గేమ్ స్టార్ట్ చేసింది యూనివర్సిటీ. అయితే అంతకుముందు ప్రొఫెసర్ నేహా సింగ్ తామే తయారు చేశాం అని చెప్పిన వీడియోలు స్పష్టంగా ఉండటంతో యూనివర్సిటీ మాటలను కొట్టిపారేస్తున్నారు నెటిజన్లు. మరోవైపు యూనివర్సిటీ ప్రతినిధులు మాత్రం తమకు స్టాల్ ఖాళీ చేయమని ఎలాంటి ఆదేశాలు రాలేదని.. తాము బాధ్యతాయుతమైన విద్యాసంస్థ అని చెబుతున్నారు.