ఢిల్లీలో జరుగుతున్న ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ - 2026 పై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆసక్తికర కామెంట్స్ చేశారు. ప్రస్తుతం సమ్మిట్ పేరుతో ఢిల్లీలో జరుగుతోందంతా కేవలం ప్రచారం కోసం చేస్తున్న హడావిడే అన్నారు. దీనిని పీఆర్ స్పెక్టాకిల్ అంటూ ఒక్క ముక్కలో తేల్చేశారు. సరైన నిర్వహణ లేకపోవటం నుంచి ముఖ్యంగా చైనా రోబోలను మనవిగా ప్రదర్శిస్తున్నారని వస్తున్న వార్తలపై రాహుల్ తన ఎక్స్ పోస్టులో మాట్లాడారు.
భారతదేశం దగ్గర అపారమైన డేటా, మేధావులైన యువత ఉన్నప్పటికీ.. ప్రభుత్వం ఈ సదస్సును ఒక అస్తవ్యస్తమైన ప్రచార వేదికగా మార్చేసిందని రాహుల్ గాంధీ మండిపడ్డారు. మోడీ ప్రభుత్వం భారతీయ డేటాను అమ్మకానికి పెట్టిందని. చైనా ఉత్పత్తులను సదస్సులో ప్రదర్శిస్తున్నారంటూ ఆయన తన ఎక్స్ పోస్ట్‌లో ఆరోపించారు. ప్రపంచ స్థాయిలో భారతదేశ ప్రతిష్టను ఈ సదస్సు దిగజార్చిందని.. ఏఐ వంటి కీలక రంగాన్ని మోడీ ప్రభుత్వం ఒక జోక్‌గా మార్చేసిందని కాంగ్రెస్ పార్టీ విమర్శించింది.
The Modi government has made a laughing stock of India globally, with regard to AI.
— Congress (@INCIndia) February 18, 2026
In the ongoing AI summit, Chinese robots are being displayed as our own. The Chinese media has mocked us. This is truly embarrassing for India.
What is even more shameful is the fact that… pic.twitter.com/xaRwm7j9Wv
చైనా రోబో 'ఓరియన్' వివాదం..
ఈ వివాదానికి ప్రధాన కేంద్ర బిందువు గల్గోటియాస్ యూనివర్సిటీ స్టాల్. సదస్సులో ఈ యూనివర్సిటీ ఓరియన్ అనే రోబోటిక్ డాగ్‌ను ప్రదర్శించింది. అయితే అది స్వదేశీ ఆవిష్కరణ కాదని.. చైనాకు చెందిన యూనిట్రీ గో2 (Unitree Go2) మోడల్ అని సోషల్ మీడియాలో నెటిజన్లు ఆధారాలతో సహా బయటపెట్టారు. దీనిపై చైనా మీడియా కూడా భారత్‌ను ఎగతాళి చేస్తోందని కాంగ్రెస్ ఆరోపించింది. వివాదం ముదరడంతో ప్రభుత్వం సదస్సు నుంచి ఆ యూనివర్సిటీ స్టాల్‌ను తక్షణమే ఖాళీ చేయాలని ఆదేశించింది. దీనిపై యూనివర్సిటీ స్పందిస్తూ.. తాము ఆ రోబోను తయారు చేశామని ఎప్పుడూ చెప్పలేదని, కేవలం విద్యా ప్రయోజనాల కోసం చైనా నుంచి కొనుగోలు చేశామని వివరణ ఇచ్చింది.
మంత్రి అశ్విని వైష్ణవ్ క్షమాపణలు..
మరోవైపు సమ్మిట్ మొదటి రోజున ఏర్పాట్లు అస్తవ్యస్తంగా ఉండటం.. భారీగా క్యూలు, తొక్కిసలాట, స్టాల్ లో వస్తువుల దొంగతనం వంటి పరిస్థితులపై ఐటీ మంత్రి అశ్విని వైష్ణవ్ స్వయంగా క్షమాపణలు చెప్పిన సంగతి తెలిసిందే. సదస్సు నిర్వహణలో తలెత్తిన లోపాలను పరిష్కరించేందుకు ఒక వార్ రూమ్ కూడా ఏర్పాటు చేశామని తెలిపారు. అయితే చైనా రోబోలను కేంద్ర మంత్రి స్వయంగా ప్రోత్సహిస్తున్నారని కాంగ్రెస్ చేసిన ఆరోపణలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కనీసం ప్రదర్శనకు వస్తున్న వారు పెట్టిన ఉత్పత్తులు ఎక్కడివనే కనీస బేసిక్ చెక్స్ కూడా చేయకపోవటంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
