ఏఐ సమ్మిట్‌లో శారీ డిజైనర్ నుంచి ఏఐ హెల్త్ రోబోల వరకూ అదరగొట్టిన విషయాలు ఇవే..

ఏఐ సమ్మిట్‌లో శారీ డిజైనర్ నుంచి ఏఐ హెల్త్ రోబోల వరకూ అదరగొట్టిన విషయాలు ఇవే..

ఢిల్లీలోని భారత్ మండపం వేదికగా జరుగుతున్న ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ 2026 సాంకేతిక ప్రపంచంలో సరికొత్త విప్లవానికి నాంది పలుకుతోంది. ప్రపంచ స్థాయి టెక్ దిగ్గజాలు, మంత్రులు, స్టార్టప్ ప్రతినిధులు హాజరైన ఈ సమ్మిట్‌లో ఏఐ మన దైనందిన జీవితాలను ఎలా మార్చబోతుందో కళ్లకు కట్టినట్లు కనిపించింది. ఫిబ్రవరి 20 వరకు జరిగే ఈ ఎక్స్‌పోలో ప్రధానంగా ఆకట్టుకుంటున్న కొన్ని ముఖ్యమైన విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

దేశీ స్మార్ట్ గ్లాసెస్: సర్వమ్ కాజే
ఈ సమ్మిట్‌లో అందరి దృష్టిని ఆకర్షించింది దేశీయ స్టార్టప్ రూపొందించిన 'సర్వమ్ కాజే' స్మార్ట్ గ్లాసెస్. ప్రధాని మోడీ స్వయంగా వీటిని ధరించి ప్రారంభించారు. ఇవి కేవలం మాటలతోనే పని చేస్తాయి. భారతీయ భాషలకు అనుగుణంగా రూపొందించిన ఈ గ్లాసెస్.. మెటా కంపెనీ గ్లాసెస్‌కు గట్టి పోటీనిస్తున్నాయి. మే 2026 నుంచి ఇవి మార్కెట్లోకి అందుబాటులోకి రానున్నాయి.

సురక్షిత ప్రయాణం: అల్ట్రావైలెట్ ఎక్స్-47
భారతీయ రహదారులపై ప్రమాదాలను తగ్గించే లక్ష్యంతో అల్ట్రావైలెట్ ఎక్స్-47 ఎలక్ట్రిక్ మోటార్ సైకిల్‌ను ప్రదర్శించారు. దీనికి ఇన్-బిల్ట్ కెమెరాలు, రాడార్ వ్యవస్థ ఉంటుంది. ప్రమాదాన్ని ముందే పసిగట్టి రైడర్‌ను అప్రమత్తం చేయడం దీని ప్రత్యేకత. టూవీలర్లలో ఇలాంటి అత్యాధునిక సేఫ్టీ ఫీచర్ తీసుకురావడం విశేషం.

రోబోల మెదడు: క్వాల్కమ్ డ్రాగన్ వింగ్
హ్యుమనాయిడ్ రోబోల తయారీలో భారత్ హబ్‌గా మారుతున్న తరుణంలో.. వాటికి ప్రాణం పోసే 'డ్రాగన్ వింగ్ IQ-10' చిప్‌ను క్వాల్కమ్ ప్రదర్శించింది. ఇది రోబోలు క్లౌడ్ సర్వర్ సాయం లేకుండానే సొంతంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడానికి సహకరిస్తుందని కంపెనీ వెల్లడించింది.

ఇండస్ట్రీల్లో రక్షకుడు: స్కౌట్
ఆయిల్ రిగ్స్, పవర్ ప్లాంట్స్ లాంటి ప్రమాదకర ప్రాంతాలను మనుషుల ప్రమేయం లేకుండా తనిఖీ చేసే 'స్కౌట్' రోబో ఎక్స్‌పోలో హైలైట్‌గా నిలిచింది. EY బూత్‌లో ఉన్న ఈ రోబో.. ఏదైనా యంత్రం పాడవ్వకముందే ఆ లోపాన్ని గుర్తించి హెచ్చరిస్తుంది.

చేనేతకు ఏఐ తోడు: టీసీఎస్ కొత్త ఆలోచన
నలిగిపోతున్న చేనేత రంగానికి టెక్ దిగ్గజం TCS ఏఐ ద్వారా కొత్త ఊపిరి పోస్తోంది. వాయిస్ కమాండ్ ద్వారా చీరల డిజైన్లను క్షణాల్లో మార్చుకోవచ్చు. 'స్మార్ట్ వీవర్ అసిస్ట్' ద్వారా అనుభవం లేని కార్మికులు కూడా క్లిష్టమైన డిజైన్లను ఖచ్చితత్వంతో నేయవచ్చు. దీనివల్ల డిజైన్ తయారీకి పట్టే వారాల సమయం నిమిషాల్లోకి తగ్గుతుంది.

వైద్య రంగంలో విప్రో విప్లవం
గ్రామీణ ప్రాంతాల్లో స్పెషలిస్ట్ డాక్టర్ల కొరతను తీర్చేందుకు విప్రో హెల్త్ ఏఐ ముందుకు వచ్చింది. రోగి స్కాన్ రిపోర్టులను ఇది విశ్లేషించి.. వ్యాధిని గుర్తిస్తుంది. డాక్టర్లకు ఇది ఒక సమర్థవంతమైన సహాయకుడిగా పనిచేస్తూ ప్రాణాలను కాపాడటంలో కీలక పాత్ర పోషిస్తుంది.

ALSO READ : ఇండియా పరువు తీశారు.. AI సమ్మిట్ నుంచి వెళ్లిపోండి.. గల్గోటియాస్ వర్సిటికీ సీరియస్ వార్నింగ్

చదువు, షాపింగ్.. అంతా ఏఐ మయం
పరీక్షల్లో కాపీయింగ్‌ను అరికట్టేందుకు ఎక్స్‌ట్రా మార్క్స్ ఏఐ వ్యవస్థను ప్రవేశపెట్టింది. ఇది విద్యార్థుల ప్రవర్తనను గమనించి టీచర్‌ను అప్రమత్తం చేస్తుంది తప్ప స్వయంగా శిక్షించదు. అటు రిటైల్ రంగంలో వర్చువల్ ట్రై-ఆన్ కియోస్క్లు దుస్తులను ధరించకుండానే అవి మనకు ఎలా సరిపోతాయో స్క్రీన్ మీద చూపిస్తాయి. ట్రయల్ రూమ్స్ ముందు క్యూ కట్టే ఇబ్బందులను ఇది తొలగిస్తుంది. మొత్తానికి భారత్ మండపంలో జరుగుతున్న సదస్సులోని ఎగ్జిబిషన్స్.. ఏఐ కేవలం సాఫ్ట్‌వేర్ మాత్రమే కాదు, అది మన జీవన విధానాన్ని మార్చే శక్తి అని లైవ్‌లో చూపిస్తూ నిరూపిస్తోంది.