హైదరాబాద్: రంగారెడ్డి జిల్లాలోని గ్రేటర్ శంషాబాద్ జోన్ పరిధిలో రాళ్లగూడ రోడ్డులో నూతనంగా నిర్మించి ప్రారంభోత్సవానికి సిద్ధం చేసిన ఏబీవీ రీలైఫ్ హాస్పిటల్ వివాదంలో చిక్కుకుంది. నకిలీ మెడికల్ సర్టిఫికెట్తో డాక్టర్గా చలామణి అవుతున్న ఆనంద్ కుమార్పై చర్యలు తీసుకోవాలని స్థానికంగా ఉన్న డాక్టర్స్ మెడికల్ అసోసియేషన్ సభ్యులు శంషాబాద్ జోన్ డీసీపీ రాజేష్ను కలిసి ఫిర్యాదు చేశారు. తెలంగాణ మెడికల్ కౌన్సిల్లో (TGMC) కూడా ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. ఆనంద్ కుమార్ చిట్‌పల్లి అనే వ్యక్తి డాక్టర్ పేరుతో చలామణీ కావడమే కాకుండా గతంలో షాద్ నగర్లో హాస్పిటల్ తెరిచి వైద్యం చేశాడని ఫిర్యాదులో పేర్కొన్నారు.
అక్కడ వైద్యుల ఫిర్యాదుతో ఆనంద్ కుమార్ పైన కేసులు కూడా నమోదయ్యాయని చెప్పారు. ఇప్పుడు శంషాబాద్లోనీ రాళ్లగూడ రోడ్డులో ఏబీవీ రీ లైఫ్ పేరుతో హాస్పిటల్‌ను ప్రారంభించడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ఎలాంటి మెడికల్ డిగ్రీ సర్టిఫికెట్ లేకపోయినా డాక్టర్ పేరు పెట్టుకుని ప్రజలను, అధికారులను తప్పు దోవ పట్టిస్తున్నాడని తెలిపారు. ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నాడని.. అందువల్ల ఆయన ఎలాంటి వైద్య సేవలు కొనసాగించకుండా తగు చర్యలు తీసుకోవాలని డీసీపీకి సూచించారు.
ఆయనపై విచారణ జరిపి చట్టపరంగా చర్యలు తీసుకోవాలని మెడికల్ అసోసియేషన్ సభ్యులు డాక్టర్ అమరేందర్, శంషాబాద్ మెడికల్ అసోసియేషన్ అధ్యక్షుడు ట్రెజరర్ ఐఎంఏ సంతోష్ కుమార్, వేణుగోపాల్ శివకాంత్ శంషాబాద్ డీసీపీకి ఫిర్యాదు చేశారు. డాక్టర్ అమరేందర్ మాట్లాడుతూ.. ఐఎంఏ శంషాబాద్ నుంచి తన పేరు వాడుకున్నాడని, తాను ఎలాంటి అనుమతులు ఇవ్వలేదని ఎలాంటి డిగ్రీ లేనటువంటి వారికి ప్రోత్సాహం చేయడం సరైంది కాదని ఆయన చెప్పారు. పూర్తి విచారణ చేసి నిజా నిజాలు తెలుసుకొని చట్టపరమైన చర్యలు తీసుకోవాలని శంషాబాద్ డీసీపీ రాజేష్కి ఫిర్యాదు చేసినట్టు వారు తెలిపారు.
