Chiranjeevi: నా సక్సెస్ సీక్రెట్ 'నువ్వే'.. భార్య సురేఖకు చిరు ఎమోషనల్ బర్త్ డే విషెస్!

 Chiranjeevi: నా సక్సెస్ సీక్రెట్ 'నువ్వే'.. భార్య సురేఖకు చిరు ఎమోషనల్ బర్త్ డే విషెస్!

ప్రతి మగాడి విజయం వెనుక ఒక స్ట్రీ ఉంటుంది. అలానే నా ప్రతి అడుగులో, నా విజయ ప్రస్థానంలో భార్య సురేఖ పోషించిన పాత్ర వెలకట్టలేనిదని మెగాస్టార్ చిరంజీవి అన్నారు. ఈ రోజు (ఫిబ్రవరి 18) తన భార్యకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతూ, ఆమె తన జీవితంలో ఎంతటి కీలకమైన వ్యక్తో మరోసారి ప్రపంచానికి చాటి చెప్పారు. చిరంజీవి సోషల్ మీడియా వేదికగా భార్యపై ప్రేమతో ఒక భావోద్వేగపూరితమైన పోస్ట్ పెట్టారు.  ప్రస్తుతం నెట్టింట ఈ పోస్ట్  వైరల్ అవుతోంది..

నువ్వే నా బలం.. నా సపోర్ట్!

1980 ఫిబ్రవరి 20న చిరంజీవి, సురేఖల వివాహం జరిగింది. అప్పటి నుంచి నేటి వరకు దాదాపు 44 ఏళ్ల వైవాహిక బంధంలో సురేఖ అండగా నిలిచిన తీరును చిరంజీవి కొనియాడారు. ఈ రోజు తన పుట్టినరోజు, అలాగే అడ్వాన్స్ పెళ్లి రోజు జరుపుకుంటున్నందున నా హృదయం ఆనందంతో నిండిపోయింది.  నా విజయానికి కారణం నా టాలెంట్, స్వయంకృషి అని అందరూ అనుకుంటారు. కానీ అసలు రహస్యం నువ్వు. కుటుంబ బాధ్యతలన్నీ నువ్వు భుజాన వేసుకున్నావు కాబట్టే, నేను ఎటువంటి ఒత్తిడి లేకుండా నా వృత్తిపై దృష్టి పెట్టగలిగాను అంటూ చిరంజీవి భావోద్వేగానికి లోనయ్యారు.

కుటుంబానికి కేంద్రబిందువు

మెగా ఫ్యామిలీ ఒకేతాటిపై ఉంచడం సామాన్యమైన విషయం కాదు. మన కుటుంబానికి కేంద్ర బిందువు నువ్వే. నీ ప్రేమతో మా అందరినీ బంధించేశారు.  నా తల్లి దండ్రులకు నిజమైన కూతురిగా మారిపోయావు.  తన సొంత తల్లిదండ్రులకంటే ఎక్కువగా చూసుకున్నావు అని చిరు పేర్కొన్నారు. రామ్ చరణ్, ఉపాసన, వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్.. ఇలా మెగా వారసులందరికీ సురేఖ ఒక పెద్ద దిక్కు. మెగా కుటుంబం నేటికీ ఇంత ఐక్యంగా ఉండటానికి ఆమెలోని సహనమే కారణం అని పోస్ట్ చేశారు చిరు..

కష్టాల్లో తోడుగా.. 

సినిమా కెరీర్‌లో ఎన్నో ఒడిదుడుకులు, రాజకీయాల్లో ఎదురుదెబ్బలు తగిలినప్పుడు కొండంత అండగా నిలిచింది సురేఖ . నువ్వు నా భార్యవి మాత్రమే కాదు, నా బలం, నా శాంతి అంటూ చిరంజీవి పోస్ట్ లో పేర్కొన్నారు.  నేను ఈరోజు ఇలా ఉన్నానంటే దానికి కారణం నువ్వే. నీపై నా ప్రేమ ఎప్పటికీ ఇలాగే ఉంటుంది అంటూ సురేఖకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు చిరు. మెగా అభిమానులు కూడా సురేఖ కు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. మెగాస్టార్ విజయంలో సగం వాటా సురేఖ గారిదేనని వారు కొనియాడుతున్నారు.