ట్యాంక్ బండ్, వెలుగు: మున్సిపల్ ఎన్నికల్లో గెలిచిన బహుజన సమాజ్ పార్టీ అభ్యర్థులను అధికార పార్టీ అక్రమంగా ఎత్తుకెళ్లిందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఇబ్రాం శేఖర్ ఆరోపించారు. సోమవారం ట్యాంక్ బండ్‌లోని అంబేద్కర్ విగ్రహం వద్ద బీఎస్పీ నాయకులు ఆందోళన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కౌంటింగ్ సెంటర్ నుంచి తమ అభ్యర్థులను బలవంతంగా తీసుకెళ్లి బెదిరింపులకు పాల్పడటం రాజ్యాంగ విరుద్ధమని మండిపడ్డారు.
మేడ్చల్ జిల్లా అలియాబాద్ 18వ వార్డు కౌన్సిలర్ వెంకటేశ్, మెదక్ 17వ వార్డు కౌన్సిలర్ అరుణను మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు కిడ్నాప్ చేశారని ఆరోపించారు. తమ పార్టీ నుంచి విప్ జారీ చేశామని, న్యాయంగా తమ కౌన్సిలర్లను అప్పగించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు బాలయ్య, దయానందరావు, రామచంద్రం, చంద్రశేఖర్, కొంపల్లి రాజు పాల్గొన్నారు.
