రంగారెడ్డి: ఇబ్రహీంపట్నం మున్సిపల్ చైర్మన్ ఎన్నికపై విధించిన స్టేను హైకోర్టు ఎత్తివేసింది. దీంతో.. ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ చైర్మన్ ఎన్నికకు లైన్ క్లియర్ అయింది. కలెక్టర్దే తుది నిర్ణయం అని హైకోర్టు ప్రకటించింది.
రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీకి మంగళవారం జరగాల్సిన చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికపై హైకోర్టు స్టే ఇచ్చిన సంగతి తెలిసిందే. బుధవారం ఈ స్టేను కొట్టివేసినట్లు కోర్టు ప్రకటించిది. అయితే.. మంగళవారం ఏం జరిగిందంటే.. ఆచూకీ తెలియని 19 వార్డు కౌన్సిలర్‌గా గెలుపొందిన ఆకుల యాదగిరిని బుధవారం ఉదయం భార్యతో సహా హాజరుపరచాలంటూ ఆదేశాలు జారీ చేసింది.
రెండు వర్గాల వారు భిన్న వాదనలను వినిపిస్తుండటంతో వాస్తవ నిర్ధారణ కోసం అమికస్ క్యూరీగా న్యాయవాది ఎ. రామకృష్ణారెడ్డిని నియమించింది. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో 19వ వార్డు కౌన్సిలర్‌గా ఎన్నికైన యాదగిరి కనిపించకపోవడంతో ఆయన కుమారుడు ఆకుల హరికాంత్ హైకోర్టులో మంగళవారం ఉదయం లంచ్ మోషన్ పిటిషన్ వేశారు. ఎన్నిక కొనసాగుతున్న నేపథ్యంలో ఉదయం 11 గంటలకు జస్టిస్ మౌసమీ భట్టాచార్య, జస్టిస్ గాడి ప్రవీణ్‌కుమార్‌తో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది.
* ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ 19 వార్డు కౌన్సిలర్ యాదగిరిని కోర్టులో హాజరు పరిచిన పోలీసులు
* మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి, ఆయన కుమారుడు తనను బలవంతంగా చీరాల తీసుకెళ్లినట్లు కోర్టుకు తెలిపిన కౌన్సిలర్ యాదగిరి
* బౌన్సర్ల పర్యవేక్షణలో తనను ఉంచారని కోర్టుకు వాంగ్మూలం ఇచ్చిన యాదగిరి
* బీఆర్ఎస్ తరఫున బీసీ అభ్యర్థిగా చైర్మన్ రేసులో ఉన్నానని కోర్టుకు తెలిపిన యాదగిరి
* చైర్మన్ ఎన్నిక ప్రక్రియ ప్రారంభమైందని కానీ ముగియలేదని కోర్టుకు తెలిపిన అమికస్ క్యూరి వెంకటేష్
* తన ఫోను కూడా ప్రశాంత్ రెడ్డి దగ్గరే ఉందని కోర్టుకు తెలిపిన యాదగిరి
* తనకు ప్రాణహాని ఉందని.. భద్రత కల్పించాలని కోర్టును కోరిన యాదగిరి
* అనారోగ్యం ఉన్నందున రెండు రోజులు ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటానని కోర్టుకు తెలిపిన యాదగిరి
* చైర్మన్ ఎన్నిక విషయంలోనే యాదగిరి ఈ విధంగా మాట మారుస్తున్నారని కోర్టుకు తెలిపిన మాజీ ఎమ్మెల్యే కిషన్ రెడ్డి తరఫున న్యాయవాది
* బీఆర్ఎస్ తరఫున చైర్మన్గా వేరే అభ్యర్థి పేరు ప్రతిపాదించిన తర్వాతనే యాదగిరి మాట మారుస్తున్నారని కోర్టుకు తెలిపిన మంచిరెడ్డి కిషన్ రెడ్డి తరపు న్యాయవాది
* బీఆర్ఎస్ చైర్మన్ అభ్యర్థికి ఇప్పటికే 15 మంది అభ్యర్థుల మద్దతు ఉందన్న మంచిరెడ్డి కిషన్ రెడ్డి తరఫున న్యాయవాది
* హెబియస్ కార్పస్ పిటిషన్ చెల్లదని వాదించిన ఇంప్లీడ్ పిటిషనర్ తరపు న్యాయవాది ఎల్ రవిచంద్ర
* చట్ట ప్రకారం చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక సకాలంలో జరగాలన్న మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి తరపు న్యాయవాది
* యాదగిరి ఫోను వెంటనే ఇప్పించాలని ఆదేశించిన హైకోర్టు
* యాదగిరిపై ఎలాంటి ఒత్తిడి తీసుకురావద్దని.. ఆయన స్వచ్ఛందంగా వ్యవహరించేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్, పోలీసులను ఆదేశించిన హైకోర్టు
* యాదగిరి కుమారుడు దాఖలు చేసిన హెబియస్ కార్పస్ పిటిషన్పై విచారణ ముగించిన హైకోర్టు
