అంతా ఉత్తదే.. నా కొడుక్కి పెళ్లి చేసుకునే ఏజ్ లేదు: ఇషాన్ పెళ్లిపై తల్లి క్లారిటీ

అంతా ఉత్తదే.. నా కొడుక్కి పెళ్లి చేసుకునే ఏజ్ లేదు: ఇషాన్ పెళ్లిపై తల్లి క్లారిటీ

న్యూఢిల్లీ: టీమిండియా స్టార్ క్రికెటర్ ఇషాన్ కిషన్ పెళ్లి చేసుకుబోతున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. ఇందుకు ప్రధాన కారణం ఇషాన్ తాత రామ్‌ అనుగ్రహ పాండే చేసిన వ్యాఖ్యలే. మోడల్‌ అదితి హుండియాతో ఇషాన్‌ పెళ్లి చేసుకోవచ్చని ఆయన పేర్కొనడంతో ఈ యంగ్ క్రికెటర్ పెళ్లి వార్తలు ఊపందుకున్నాయి. అసలు ఎవరీ అదితి హుండియా అని ఇషాన్ ఫ్యాన్స్ ఆరా తీయడం కూడా మొదలుపెట్టారు. ఈ క్రమంలో ఇషాన్ పెళ్లి వార్తలపై అతడి తల్లి సుచిత్రా దేవి స్పందించారు. 

ఇషాన్ పెళ్లి వార్తలను ఆమె తోసిపుచ్చారు. తన కుమారుడికి ఇంకా పెళ్లి చేసుకునే వయస్సు లేదని ఆమె పేర్కొన్నారు. ఇషాన్ ప్రస్తుతానికి క్రికెట్‌పైనే దృష్టి పెడతాడని క్లారిటీ ఇచ్చారు. ఈ యంగ్ క్రికెటర్  పెళ్లి చేసుకోబోతున్నాడంటూ అతడి తాత చేసిన వ్యాఖ్యలపైన ఆమె రియాక్ట్ అయ్యారు. 

సోషల్ మీడియాలో వచ్చిన పుకార్లను చూసి ఆయన ఏదో మాట్లాడారని అన్నారు. ఇషాన్ తాతయ్యకు వయస్సు మీద పడుతుందన్నారు. వృద్ధులు ఎప్పుడూ కొంచెం ఉత్సాహంగా ఉంటారని.. కొన్ని విషయాలను మర్చిపోతారు.. మరికొన్నింటిని ఏదో ఊహించి మాట్లాడుతారని పేర్కొన్నారు. ప్రస్తుతానికి ఇషాన్‌ వివాహం గురించి చర్చలేమీ లేవని ఆమె కుండబద్దలు  కొట్టారు.  సుచిత్రా దేవి వ్యాఖ్యలతో ఇషాన్ కిషన్ పెళ్లి వార్తలకు చెక్ పడింది. 

టీ20 వరల్డ్ కప్‎లో దుమ్మురేపుతోన్న ఇషాన్:

పెళ్లి వార్తలు పక్కనబెడితే టీ20 వరల్డ్ కప్‎లో ఈ జార్ఖండ్ డైనమేట్ దుమ్మురేపుతున్నాడు. గ్రూప్ దశలో భాగంగా నమీబియా, పాకిస్తాన్‎తో జరిగిన మ్యాచుల్లో వరుస హాఫ్ సెంచరీలతో అలరించాడు. నమీబియాపై 61 పరుగులు చేసిన ఇషాన్.. చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‎పై (77) చారిత్రాత్మక ఇన్నింగ్స్ ఆడాడు. ఇషాన్ షాన్ దార్ ఇన్సింగ్స్‎తో దాయాది పాకిస్తాన్‎ను ఇండియా 61 పరుగుల తేడాతో మట్టికరిపించింది.