- 5 వందల ఎకరాల్లో సాగవుతున్న పంట
- ఐదు వేల ఎకరాలకు పెంచాలని అధికారుల లక్ష్యం
మెదక్, వెలుగు: జిల్లాలో ఆయిల్ పామ్ సాగుకు రైతులు మొగ్గు చూపుతున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సబ్సిడీ ఇస్తుండటంతో రైతులు ఆసక్తి కనబరుస్తున్నారు. చీడ పీడల బెడద తక్కువగా ఉండటం, 30 ఏళ్ల వరకు ఆదాయం లభించే అవకాశం ఉండటం, బై బ్యాక్ పద్దతిలో కంపెనీ ఉత్పత్తిని కొనుగోలు చేసేందుకు ఒప్పందం చేసుకోవడంతో రైతులు ఉత్సాహంగా ముందుకు వస్తున్నారు. జిల్లాలో ఐదు వేల ఎకరాల్లో సాగు చేయాలని లక్ష్యంగా నిర్ణయించగా, ఇప్పటి వరకు దాదాపు 500 ఎకరాల్లో ఆయిల్ ఫామ్ సాగు చేశారు.
వివిధ మండలాల్లో మరికొంత మంది రైతులు ఆసక్తి కనబరుస్తున్నారు. దశాబ్దాలుగా వరి సాగు చేస్తున్న పలువురు రైతులు పంట మార్పిడి చేయాలని భావించి ఆయిల్ పామ్ సాగుకు మొగ్గు చూపుతున్నారు. ప్రస్తుతం జిల్లాలోని 20 మండలాల పరిధిలో దాదాపు 500 ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగు చేశారు. అత్యధికంగా వెల్దుర్తి మండలంలో 250 ఎకరాల్లో, నర్సాపూర్ మండలంలో 50 ఎకరాల్లో, చిన్నశంకరంపేట మండలంలో 45 ఎకరాల్లో సాగు చేయగా, రామాయంపేట, నిజాంపేట, టేక్మాల్, రేగోడ్ తదితర మండలాల్లో రైతులు ఆయిల్ ఫామ్ తోటలు సాగు చేస్తున్నారు.
సబ్సిడీ ఇలా...
ఆయిల్ పామ్ సాగు చేసే ఎస్సీ, ఎస్టీ రైతులకు డ్రిప్ ఇరిగేషన్ సిస్టం కోసం 100 శాతం సబ్సిడీ ఇస్తుండగా, బీసీ రైతులకు 90 శాతం, ఇతర రైతులకు 80 శాతం సబ్సిడీ ఇస్తున్నారు. ఆయిల్ పామ్ సాగు చేశాక నాలుగు సంవత్సరాల తరువాత నుంచి పంట దిగుబడి ప్రారంభం అవుతుంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని రైతులకు నాలుగేళ్ల వరకు ఏడాదికి ఎకరాకు రూ.4,200 అందజేస్తారు.
30 ఏళ్ల వరకు ఆదాయం
ఆయిల్ పామ్ తోటల సాగు ద్వారా 30 ఏళ్ల వరకు ఆదాయం పొందొచ్చు. సాగు చేసిన నాలుగేళ్ల తర్వాత నుంచి పంట దిగుబడి ప్రారంభం అవుతుంది. 30 ఏళ్ల వరకు ఆదాయం పొందే అవకాశం ఉంది. ప్రభుత్వం మొక్కలకు, డ్రిప్ కు సబ్సిడీ ఇవ్వడంతోపాటు, కంపెనీ ద్వారా పంటోత్పత్తి కొనుగోలు చేసేందుకు బై బ్యాక్ విధానం అందుబాటులో ఉంది. దీనివల్ల రైతులకు బెనిఫిట్ కలుగుతుంది.
సోలార్ ఫెన్సింగ్‌కు సబ్సిడీ ఇవ్వాలి
నాకు 10 ఎకరాల పొలం ఉంది. ఇది వరకు అంతా వరి పంట సాగు చేసేది. నీటి లభ్యత, లేబర్ సమస్య కారణంగా వరికి బదులు ప్రత్యామ్నాయంగ ఏడెకరాల్లో ఆయిల్ పామ్ సాగు చేస్తున్నాను. అంతరపంటగా బొప్పాయి సాగు చేయాలనుకుంటున్నాము. కాగా అడవి పందుల బెడద వల్ల ఇబ్బంది ఉంది. అందుకని సోలార్ ఫెన్సింగ్ కోసం ప్రభుత్వం సబ్సిడీ ఇస్తే బాగుంటుంది. అలాగే ఆయిల్ పామ్‌కు సంబంధించిన ఫ్యాక్టరీ నిర్మాణం కూడా త్వరితగతిన పూర్తి చేస్తే మరింత ఎక్కువ మంది రైతులు ఆయిల్ పామ్ సాగుకు ముందుకు వచ్చే అవకాశం ఉంది.
ప్రతాప్‌రెడ్డి, రైతు, ధరిపల్లి
జిల్లాలో అనుకూలం
మెదక్ జిల్లాలో ఆయిల్ పామ్ తోటల సాగుకు లివింగ్ ఫుడ్ ఇండియా కంపెనీ పూర్తి సహాయ సహకారాలు అందిస్తుంది. జిల్లాలో ఆయిల్ పామ్ తోటల సాగుకు అనుకూల వాతావరణం ఉంది. ఒక ఎకరాకు 57 మొక్కలు అవసరం అవుతాయి. ఒక మొక్క ధర రూ.19 ఉంటుంది. కానీ సబ్సిడీపై రైతులకు రూ.20 అందుతుంది. అంతేగాక పంట సాగు యాజమాన్య పద్దతులపై రైతులకు అవగాహన కల్పిస్తాం. ఆయిల్ ఫాం సాగు చేసిన నాలుగేళ్ల తర్వాత నుంచి దిగుబడి వస్తుంది. అప్పటి వరకు అంతర పంట సాగు కోసం ఏడాదికి రూ.4,200 అందిస్తాం
– డాక్టర్ కృష్ణ, జీఎం, లివింగ్ ఫుడ్ ఇండియా జనరల్ మేనేజర్