- మహబూబాబాద్ కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్
మహబూబాబాద్, వెలుగు: జిల్లాలో ఈ నెల 27 న నిర్వహించే నల్గొండ, వరంగల్, ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించిన బ్యాలెట్ బాక్సులను సిద్ధం చేయాలని మహబూబాబాద్ కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ కోరారు. బుధవారం కలెక్టరేట్లో నిర్వహించిన సమావేశంలో కలెక్టర్మాట్లాడుతూ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమలులో ఉంటుందని, రోజువారి నివేదికలు ఎప్పటికప్పుడు పంపాలన్నారు. ఎలక్షన్ కోడ్ అమలయ్యే విధంగా జిల్లా ఆఫీసర్లు తగిన చర్యలు చేపట్టాలన్నారు. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ ఎం.డేవిడ్, మహబూబాబాద్ ఆర్డీవో ఎల్.అలివేలు, ఎలక్షన్ విభాగం సూపరింటెండెంట్ పవన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
ఈనెల 27న ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్
జనగామ అర్బన్, వెలుగు: ఈ నెల 27న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలు జరగనున్నట్లు జనగామ ఎలక్షన్ ఆఫీసర్, కలెక్టర్ రిజ్వాన్బాషా షేక్ బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఓటుహక్కు వినియోగించుకునేందుకు 27 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. జనగామ జిల్లాలో జనగామ, స్టేషన్ఘనపూర్ డివిజన్లు ఉండగా, జనగామ డివిజన్లో 9341 మేల్ ఓటర్లు, 5544 ఫీమేల్ ఓటర్లు, ఇతరులు ఒక్కరు ఉండగా, మొత్తంగా 14,886 ఓటర్లు ఉన్నట్లు తెలిపారు. స్టేషన్ఘనపూర్ డివిజన్లో 5574 మేల్ ఓటర్లు, 2959 ఫీమేల్ ఓటర్లు, మొత్తంగా 8533 మంది ఓటర్లు ఉన్నట్లు తెలిపారు. జిల్లాలో మొత్తం 23,419 మంది గ్రాడ్యుయేట్లు ఉండగా, ఇందులో దివ్యాంగులు 725 మంది ఓటర్లు ఉన్నట్లు పేర్కొన్నారు. వెబ్సైట్ ద్వారా ఎమ్మెల్సీ ఓటు వివరాలు తెలుసుకోవచ్చని తెలిపారు.