సికింద్రాబాద్, వెలుగు: ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ జంట జలాశయాల రక్షణకు ఉద్దేశించిన జీవో 111 తొలగింపు నిర్ణయాన్ని ఖండిస్తున్నామని పలువురు వక్తలు అన్నారు. సంప్రదింపులు లేని, శాస్త్రీయత కొరవడిన ఈ నిర్ణయం స్థానిక ప్రజల జీవనానికి, భవిష్యత్తు తరాలకు గొడ్డలిపెట్టు లాంటిదని పేర్కొన్నారు. జీవో 111 రద్దుతో అక్రమ నిర్మాణాలను ప్రభుత్వం ప్రోత్సహించనట్లయిందని ఆందోళన వ్యక్తం చేశా రు. ఆ జీవో పరిధిలోని 84 గ్రామాల్లో ఇకపై నిర్మాణాలకు అడ్డూఅదుపు లేకుండా పోతుందన్నారు. ప్రభుత్వం ఏకపక్షంగా తీసుకున్న నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. గురువారం హైదరాబాద్‌లోని వెస్ట్ మారేడ్‌పల్లి హైదరాబాద్ జిందాబాద్, తెలంగాణ సోషల్ మీ డియా ఫోరం ఆధ్వర్యంలో జీవో 111 రద్దుతో ‘‘పట్నానికి పాడే..- భవిష్యత్తు కార్యాచరణ’’పై సదస్సు నిర్వహించారు. సోషల్ మీడియా ఫోరం కన్వీనర్ కరుణాకర్ దేశాయ్ అధ్యక్షతన జరిగిన సదస్సు పలువురు వక్తలు మాట్లాడారు. ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ రిజర్వాయర్లు హైదరాబాద్, సికింద్రాబాద్ ప్రజల తాగు నీటి అవసరాలను తీర్చడమే కాకుండా భారీ వరదల నుంచి నగరాన్ని కాపాడుతున్నాయన్న వక్తలు అన్నారు. జీవో 111 రద్దుతో ఈ జంట జలాశయాలు మరో హుస్సేన్‌సాగర్‌లా మారే ప్రమాదం ఉందన్నారు.
భూముల్లేని పేదలకు మూడెకరాలు ఇవ్వాలి..
జలాశయాల పరివాహక ప్రాంతాల్లో ఈ ఏడాది ప్రత్యేకంగా బహుజన బతుకమ్మ ఉత్సవాలకు నిర్వహించాలని వక్తలు డిమాండ్ చేశారు. ‘‘ఈ గ్రామాల్లో భూమి లేని పేదలకు 111 జీవో పరిధిలో ఉన్న ప్రభుత్వ భూముల్లో కనీసం మూడెకరాలు ఇవ్వాలి. జీవో పరివాహక ప్రాంతంలో భూమి వినియోగ సర్వే చేపట్టాలి. 111 జీవో పరిధిలోని ప్రాంతాల్లో అక్రమ నిర్మాణాలను తొలగించాలి. అక్రమ నిర్మాణాలు చేపట్టిన వారిపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలి. ఆ గ్రామాల్లో ప్రజా సంఘాలతో కలిసి పర్యటించి, ప్ర జల అభిప్రాయాలను తెలుసుకొని వైట్ పేపర్‌ను రి లీజ్ చేస్తాం”అని పేర్కొన్నారు. సదస్సులో ప్రముఖ పర్యావరణవేత్త ప్రొఫెసర్ పురుషోత్తం రెడ్డి, నర్సింహా రెడ్డి, ప్రొఫెసర్ సుబ్బారావు, సీనియర్ జర్నలిస్టు పాశం యాదగిరి, మాజీ ఐఏఎస్ అధికారి ఆకునూరి మురళి తదితరులు హాజరై మాట్లాడారు.
ఆ 84 గ్రామాల ప్రజలను ఆదుకోవాలి..
జీవో పరిధిలో ఉన్న గ్రామాల్లోని స్థానిక ప్రజల ను భాగస్వామ్యులను చేయకుండా, వారి అభివృద్ధి పేరు మీద ఈ ప్రాంతాన్ని ధనికులకు, వలస వచ్చిన వాళ్లకు, తెలంగాణ వ్యతిరేకులకు అందజేయడం రాష్ట్ర ప్రభుత్వానికి తగదన్నారు. ఆ 84 గ్రామస్తుల జీవనోపాధికి విఘాతం కలిగిస్తుందన్నారు. ఆ గ్రామాల్లో పర్యటించి నిజమైన రైతులు ఎంత శాతం మంది ఉన్నారు..? ఎవరెవరికి భూములు ఉన్నాయి..? సర్వే చేసి వైట్ పేపర్ రిలీజ్ చేయాలన్నారు. ఈ సందర్భంగా సదస్సులో ఎనిమిది తీర్మానాలు చేశారు.

