న్యూఢిల్లీ : కరోనా వ్యాప్తిని అడ్డుకునేందుకు దేశ వ్యాప్తంగా అమలులో ఉన్న లాక్‌డౌన్ వల్ల స్పోర్టింగ్ ఈవెంట్స్ అన్నీ ఆగిపోయాయి. ఏడాది పొడవు నా బిజీబిజీగా ఉండే క్రికెటర్లు కూడా ఇళ్లకే పరిమితమైపోయారు. కెప్టెన్ కోహ్లీ నుంచి జట్టులో అందరూ ఫ్యామిలీస్‌తో ఎంజాయ్ చేస్తున్నారు. అయితే యుజ్వేంద్ర చహల్ మాత్రం లాక్‌డౌన్ ఎప్పుడెప్పుడు ఎత్తేస్తారా అని ఎదురుచూస్తున్నాడు. ఎంతలా అంటే లాక్‌డౌన్ ఎత్తేశాక.. ఓ మూడేళ్ల పాటు ఇంటిగుమ్మంతొక్కనని అంటున్నాడు . ‘ఇంతకుమించి ఇంట్లో ఉండడం నా వల్ల కాదు. దేశంలో లాక్‌డౌన్ ఎత్తేశాక నేను మా ఇంటికి లాక్‌డౌన్ ప్రకటిస్తా. కనీసం మూడేళ్లు గుమ్మం తొక్కను. అవసరమైతే ఏదైనా హోటల్‌లో ఉంటా కానీ ఇంటికి మాత్రం రాను. ఇంక లాక్‌డౌన్‌ను భరించడం నా వల్ల కాదు. చుట్టూ చాలా జరుగుతోంది. కానీ పని లేకుండా ఇంకా ఎక్కువ కాలం ఉండలేం. బౌలింగ్‌ను మిస్సవుతున్నా. లాక్‌డౌన్ ముగిసిన తర్వాత గ్రౌండ్‌కు వెళ్లి కనీసం ఒక్క బాల్ అయినా బౌలింగ్ చేస్తా’ అని చహల్ చెప్పుకొచ్చాడు.

