పెంపుడు కుక్కపై ప్రేమంటే ఇదీ.. తప్పిపోయిన టైగర్ ప్రత్యక్షం.. 60 కి.మీ నడిచి మొక్కు చెల్లించుకున్న యజమాని..

పెంపుడు కుక్కపై ప్రేమంటే ఇదీ.. తప్పిపోయిన టైగర్ ప్రత్యక్షం.. 60 కి.మీ నడిచి మొక్కు చెల్లించుకున్న యజమాని..

మూడు నెలలకు పైగా కనిపించకుండా పోయిన  పెంపుడు కుక్క తిరిగి రావడంతో ఓ యజమాని తన మొక్కును ఘనంగా తీర్చుకున్నాడు. గుజరాత్‌లో జరిగిన.. హృదయాలను  హత్తుకునే  ఈ ఘటన నెట్టింట వైరల్ అయ్యింది.

సమాచారం ప్రకారం.... గుజరాత్‌లోని బనస్కాంత జిల్లాలో ఓ వ్యక్తి హోటల్ నడుపుతున్నాడు. అతని దగ్గర 'టైగర్' అనే లాబ్రడార్ జాతికి చెందిన పెంపుడు కుక్క ఉంది. సుమారు మూడున్నర నెలల క్రితం ఆ కుక్క ఎటో వెళ్లిపోయింది. ఎంత వెతికినా  దొరకకపోవడంతో ఆ యజమాని తీవ్రంగా బాధపడ్డాడు. అయితే కుక్క క్షేమంగా తిరిగి వస్తే, తన ఇంటికి దగ్గర్లోని ప్రముఖ అంబాజీ ఆలయానికి కాలినడకన వస్తానని దేవుడికి మొక్కుకున్నాడు.

ఆశలు వదులుకొని... చివరికి ఎలాంటి ఆశ లేని సమయంలో, ఆ కుక్క ఒక్కసారిగా దానంతట అదే యజమాని హోటల్ వద్దకు తిరిగి వచ్చింది. అటుగా రిక్షాలో వస్తున్న టైగర్.. తన యజమాని గొంతును గుర్తించి, వెంటనే రిక్షా దిగి పరుగెత్తుకుంటూ వచ్చి అతన్ని హత్తుకుంది. 3 నెలలకి పైగా పెంపుడు కుక్క కనిపించకపోవడంతో  కంగారు పడిన ఆ కుటుంబానికి ఈ కలయిక ఎంతో ఆనందాన్ని ఇచ్చింది.

ఘనంగా మొక్కు తీర్చుకున్న యజమాని 
కోరిన మొక్కు ప్రకారం.. హోటల్ యజమాని తన సిబ్బందితో కలిసి 60 కిలోమీటర్ల దూరంలో ఉన్న అంబాజీ ఆలయానికి కాలినడకన బయలుదేరాడు. ఈ యాత్రలో ఆ అదృష్ట కుక్క 'టైగర్' కూడా వారితో పాటు నడిచింది. దారి పొడవునా పాటలకు డ్యాన్సులు చేస్తూ, ఈ ఆధ్యాత్మిక నడకను ఆనందకరమైన ఊరేగింపులా మార్చారు. ఇందుకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో అందరినీ ఆకట్టుకుంటున్నాయి.