కరోనా టెస్టుల కోసం వేచి ఉండలేక.. క్యూలో ఆధార్ కార్డులు.. స్కానింగ్ రిపోర్టుల కవర్లు

కరోనా టెస్టుల కోసం వేచి ఉండలేక.. క్యూలో ఆధార్ కార్డులు.. స్కానింగ్ రిపోర్టుల కవర్లు

కరీంనగర్: సాధారణంగా రైతులు సబ్సిడీ విత్తనాలు.. ఎరువుల కోసం తమ చెప్పులు, వస్తువులు లైన్లలో పెట్టడం చూశాం….. కాని ఇప్పుడు మాత్రం కరోనా కాలంలో.. అనుమానంతో టెస్టులు చేయించుకుంటున్న జనం లైన్లలో తమ ఆధార్ కార్డులు.. వాటర్ బాటిళ్లు..  స్కానింగ్ రిపోర్టు కవర్లు..  ఇతర వస్తువులు  లైన్లలో ఉంచి తమ పేరు ఎప్పుడూ వస్తుందా అని ఎదురు చూసే పరిస్థితి వచ్చింది. గంగాధర  మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వద్ద జరిగిన వ్యవహారం వైరల్ అయింది. గంటల తరబడి వేచి ఉండే ఓపిక లేక చాలా మంది క్యూలో ఆధార్ కార్డులు.. చెప్పులు.. తమ ఆరోగ్య సమస్యల కోసం చేయించుకున్న ఎక్స్ రే.. స్కానింగ్ టెస్టుల పై కవర్లు.. తమ వద్ద అందుబాటులో ఉన్న వాటిని క్యూలో  పెట్టి తమ పేరు ఎప్పుడు పిలుస్తారా అనుకుంటూ.. కాస్త దూరంలో నీడకు.. చెట్ల కింద.. వాహనాలపై కూలబడి ఎదురు చూడడం గుర్తించిన కొంత మంది ఫోటోలు.. వీడియోలు తీసి షేర్ చేశారు. గంగాధర మండలంతో పాటుగా కొడిమ్యాల మండల కేంద్రానికి గంగాధర చౌరస్తా దగ్గరగా ఉండడంతో ఇవాళ కోవిడ్ నిర్ధారణ టెస్ట్ లు చేసుకోవడానికి గంగాధర ప్రభుత్వ ఆసుపత్రికి దాదాపుగా నూట యాభై మంది వరకు వచ్చారని ఆస్పత్రి వర్గాలు చెబుతున్నాయి. ప్రతి ఆరోగ్య కేంద్రం రోజు డెబ్భై మంది వరకు టెస్ట్ లు చేస్తుండగా, ఈ రోజు ఎక్కువ సంఖ్యలో  వచ్చారు. అనారోగ్య సమస్యలతో.. వృద్దాప్య సమస్యలతో కొంత మంది లైన్ లో గంటల తరబడి వేచి ఉండ లేక తమ ఆధార్ కార్టులు.. అవి ఎగిరిపోకుండా వాటర్ బాటిల్లు.. ఆధార్ కార్డులు, స్కానింగ్ రిపోర్టులు… ఎక్స్ రే కవర్లు..  ఉంచి తమ పేరు ఎప్పుడూ వస్తుందా అని ఎదురు చూశారు. దీన్ని గుర్తించిన అనేక మంది తామెందుకు ఎండలో ఎలా వేచి ఉండాలంటూ.. వారు కూడా వాటర్ బాటిళ్లు.. ఆధార్ కార్డులు పెట్టి దూరంగా నీడకు నిలబడి.. కూర్చుని తమ వంతు కోసం ఎదురు చూశారు. జనం బారులు తగ్గాలంటే. టెస్టుల కోసం మరిన్ని కేంద్రాలను ఏర్పాటు చేయాలని వారు కోరుతున్నారు.