- ఫలితాల రోజు బీజేపీలో.. ఆదివారం కాంగ్రెస్‌లోకి ఏఐఎఫ్‌బీ కార్పొరేటర్ జ్యోతి
- విప్ జారీ చేసిన ఫార్వర్డ్ బ్లాక్ నేతలు
- బీజేపీకి మద్దతిచ్చే ప్రసక్తే లేదని వెల్లడి
- జ్యోతి తీరుతో ఆందోళనకు దిగిన బీజేపీ కార్యకర్తలు
- పదవుల కోసం బీజేపీ క్యాంపులో ముసలం
కరీంనగర్, వెలుగు: కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ పాలిటిక్స్‌లో ట్విస్టుల మీద ట్విస్టులు చోటుచేసుకుంటున్నాయి. కరీంనగర్ మేయర్ పీఠం దాదాపు బీజేపీకే సొంతమైందనుకుంటున్న సమయంలో శనివారం రాత్రి, ఆదివారం ఒక్కసారిగా రాజకీయాలు మారిపోయాయి. ఫలితాలు వెలువడిన శుక్రవారం బీజేపీలో చేరిన కరీంనగర్ చింతకుంట 15 వ డివిజన్ ఆలిండియా ఫార్వర్డ్ బ్లాక్ (ఏఐఎఫ్‌బీ) కార్పొరేటర్ విప్పల సాయి జ్యోతి.. ఆదివారం కాంగ్రెస్ లో చేరి షాక్ ఇచ్చారు. తొలుత కాంగ్రెస్ నేతలు ఆమె ఇంటికి వెళ్లి మద్దతు కోరారు.
ఈ క్రమంలోనే ఆమె తన పిల్లలకు ఆరోగ్యం బాగా లేకపోవడంతో హైదరాబాద్ వెళ్తున్నట్లు చెప్పి వెహికల్‌లో వెళ్లిపోయారు. ఆమె కాంగ్రెస్ శిబిరంలోకి వెళ్తుందేమోనని అనుమానంతో బీజేపీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. సాయిజ్యోతితో ఫోన్‌లో మాట్లాడించాలని కుటుంబ సభ్యులతో వాదనకు దిగారు.
బీజేపీలో చేరి ఎలా మరో క్యాంపునకు వెళ్తారని ప్రశ్నించారు. దీంతో పోలీసులు చేరుకొని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. అంతకంటే ముందు ఫార్వర్డ్ బ్లాక్ రాష్ట్ర కన్వీనర్ జోజిరెడ్డి, నాయకులు తేజ్‌దీప్ రెడ్డి వచ్చి తమ పార్టీ తరఫున విప్ జారీ చేసేందుకు యత్నించారు. అయితే, సాయిజ్యోతి విప్ తీసుకోకుండానే ఇంటి నుంచి వెళ్లిపోయారు. దీంతో వారు ఆ కాపీని సాయి జ్యోతి ఇంటి గోడతోపాటు మరో కార్పొరేటర్ బొట్ల శ్యామల ఇంటికి అంటించారు. ఆ తర్వాత కొద్ది గంటల్లోనే వారిద్దరూ హైదరాబాద్‌లో కాంగ్రెస్ కండువా కప్పుకోవడం గమనార్హం.
మేయర్ లేదా డిప్యూటీ మేయర్ కోసం వాసాల పట్టు
మరోవైపు మేయర్, డిప్యూటీ మేయర్ విషయంలో బీజేపీ క్యాంపులో ముసలం మొదలైనట్లు తెలిసింది. బీజేపీ మేయర్ అభ్యర్థిగా 2వ డివిజన్ కార్పొరేటర్ కొలగాని శ్రీనివాస్, డిప్యూటీ మేయర్‌గా 66వ డివిజన్ కార్పొరేటర్ పవన్ పేరును ఆ పార్టీ అధిష్టానం ప్రకటించినట్లు తెలిసింది. దీంతో తనకు మేయర్ లేదా డిప్యూటీ మేయర్ ఇవ్వకుంటే సపోర్ట్ చేయనని సీనియర్ నేత, బీజేపీ కార్పొరేటర్ వాసాల రమేశ్ వాదించినట్లు తెలిసింది. కరీంనగర్‌లో బలమైన పద్మశాలీ సామాజిక వర్గానికి తప్పకుండా ఏదో ఒక పదవి ఇవ్వాల్సిందేనని పట్టుబట్టినట్లు సమాచారం.
బీజేపీకి మద్దతిచ్చే ప్రసక్తే లేదు: జోజిరెడ్డి
తమ పార్టీ బీఫాం పైన గెలిచిన 15 డివిజన్ కార్పొరేటర్ సాయి జ్యోతిని కేంద్ర మంత్రి బండి సంజయ్ బీజేపీలో చేర్చుకోవడం సిగ్గుచేటని ఏఐఎఫ్‌బీ రాష్ట్ర కన్వీనర్ అంబటి జోజిరెడ్డి అన్నారు. ఒక కమ్యూనిస్టు పార్టీలో గెలిచిన అభ్యర్థులను బీజేపీలో ఎలా చేర్చుకుంటారని ప్రశ్నించారు. మేయర్ స్థానం కోసం బీజేపీ నీచమైన రాజకీయాలు చేస్తున్నదని విమర్శించారు. సోమవారం ఉదయం 10 గంటల వరకు తమ పార్టీ కేంద్ర, రాష్ట్ర కమిటీలు ఎవరికి మద్దతు ఇవ్వాలో స్పష్టత ఇస్తాయని, మతరాజకీయాలు చేసే బీజేపీకి మాత్రం మద్దతు ఇచ్చే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు.
