- హస్తంగూటికి చేరుతున్న ఇండిపెండెంట్లు!
- కాగజ్‌నగర్‌లో కాంగ్రెస్‌కు బీజేపీ సపోర్ట్!
- నేడు చైర్ పర్సన్, వైస్ చైర్పర్సన్ ఎన్నిక
- పదవి ఎవరికనేది ఇంకా స్పష్టత రాని వైనం
- క్యాంపు నుంచి నేరుగా మున్సిపల్ ఆఫీస్‌కు రానున్న కౌన్సిలర్లు
ఆదిలాబాద్ నెట్వర్క్, వెలుగు: ఆదిలాబాద్ మున్సిపాలిటీ చైర్పర్సన్ ఎన్నిక రసవత్తరంగా మారింది. చైర్పర్సన్ కోసం మొత్తం 26 ఓట్లు అవసరం కాగా.. ఏ పార్టీకి కూడా స్పష్టమైన మెజార్టీ రాలేదు. దీంతో పదవుల కోసం అధికార కాంగ్రెస్‌తో పాటు బీజేపీ తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాయి. ఓ వైపు ఏ పార్టీకి చైర్పర్సన్పదవి దక్కుతుందోనని ఉత్కంఠ నెలకొనగా.. మరో వైపు ఎవరు చైర్పర్సన్ అవుతా రన్న చర్చ జోరుగా సాగుతోంది. 11 వార్డుల్లో గెలిచిన కాంగ్రెస్ ఆరు స్థానాల్లో గెలిచిన ఎంఐఎం, ఐదుగురు ఇండిపెండెంట్లతో మంతనాలు జరుపుతోంది. డీసీసీ అధ్యక్షుడు నరేశ్ జాదవ్, నియోజకవర్గ ఇన్చార్జి కంది శ్రీనివాస్ రెడ్డి ఆదివారం ముగ్గురు ఇండిపెండెంట్లతో భేటీ కాగా సోమవారం మరోసారి చర్చలు జరిపారు.
పదవులపై వారికి ఆఫర్లు ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇక్కడ 21 స్థానాలు గెలిచిన బీజేపీకి సైతం ఇండిపెండెంట్ల మద్దతు ఉంటేనే చైర్ పర్సన్ పీఠం దక్కుతుంది. సోమవారం ఆదిలాబాద్ మున్సిపల్ కార్యాలయంలో చైర్ పర్సన్ ఎన్నిక జరుగనుండగా గెలిచిన ఆయా పార్టీల అభ్యర్థులను ఇప్పటికే క్యాంపులకు తరలించారు. అభ్యర్థులు క్యాంపు నుంచి నేరుగా ఆదిలాబాద్ బల్దియా ఆఫీస్‌కు చేరుకోనున్నారు.
బీఆర్ఎస్ మద్దతిస్తుందా..?
ఇండిపెండెంట్లు తమవైపే ఉన్నారంటున్న బీజేపీకి.. కాంగ్రెస్ చర్చలు మింగుడపడటం లేదు. ఇండిపెండెంట్లను తమ వైపు తిప్పుకునేందుకు కాంగ్రెస్ దూకుడుగా ముందుకెళ్తుందటం, వారితో నిత్యం చర్చలు జరుపుతుండటంతో పీఠంపై ఉత్కంఠ నెలకొంది. మరోవైపు బీఆర్ఎస్ అభ్యర్థులు సైతం కాంగ్రెస్ కు మద్దతు ఇస్తారంటూ జోరుగా చర్చ సాగుతోంది.
ఇదే జరిగితే కాంగ్రెస్ బల్దియా పీఠం దక్కించుకొని చరిత్ర సృష్టిస్తుంది. ఇప్పటివరకు బీజేపీకే ఖాయమనుకున్న చైర్పర్సన్ పీఠాన్ని దక్కించుకునేందుకు కాంగ్రెస్ రేసులోకి రావడం తీవ్ర ఉత్కంఠకు దారితీస్తోంది.
ఆసిఫాబాద్‌లో ఎత్తుకు పైఎత్తులు
ఆసిఫాబాద్ మున్సిపాలిటీ చైర్పర్సన్ ఎన్నిక హాట్ టాపిక్‌గా మారింది. ఏ పార్టీకి మెజార్టీ లేకపోవడంతో కీలకంగా మారిన ఇండిపెండెంట్ల మద్దతు కోసం అటు కాంగ్రెస్ ఇటు బీఆర్ఎస్ ఎత్తుకుపై ఎత్తులు వేస్తున్నాయి. 20 వార్డులున్న ఆసిఫాబాద్ మున్సిపాలిటీలో బీఆర్ఎస్ 9, కాంగ్రెస్ 7, ఇండిపెండెంట్లు నలుగురు విజయం సాధించారు. బీఆర్ఎస్కు ఎమ్మెల్యే ఎక్స్ ఆఫీషియో ఓటు కలిపి 10 మంది సభ్యుల మద్దతు ఉండగా.. మున్సిపల్ పీఠాన్ని దక్కించుకోవాలంటే మరో కౌన్సిలర్ సహకారం అవసరం. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే కోవ లక్ష్మి తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఇండిపెండెంట్ల కుటుంబసభ్యులను సంప్రదిస్తూ అభ్యర్థుల మద్దతు కోసం వేడుకుంటున్నారు.
ఇక అధికార కాంగ్రెస్ పలువురు ఇండిపెండెంట్లను రహస్య ప్రాంతానికి తరలించినట్లు సమాచారం. ప్రధాన పార్టీల అవకాశాన్ని గుర్తించిన ఇండిపెండెంట్లు మాత్రం ఏ పార్టీకీ మద్దతు ఇచ్చేందుకు స్పష్టమైన హామీ ఇవ్వడంలేదు. మరికొన్ని గంటల్లో మున్సిపల్ చైర్పర్సన్ ఎన్నిక జరగనుండగా కాంగ్రెస్, బీఆర్ఎస్లో టెన్షన్ వాతావరణం నెలకొంది. సభ్యులు చేజారిపోకుండా రెండు పార్టీలు విప్ జారీ చేశాయి. పార్టీ ఆదేశాల అనుగుణంగా సభ్యులు చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్లను ఎన్నుకోవాల్సి ఉంటుందని స్పష్టం చేశాయి.
భైంసాలో ఎంఐఎం, బీజేపీ మధ్య పోటీ
26 వార్డులున్న భైంసా మున్సిపాలిటీ చైర్పర్సన్ పీఠాన్ని దక్కించుకునేందుకు 14 సీట్లు మ్యాజిక్ ఫిగర్ అవసరముండగా ఎంఐఎంకు 12, బీజేపీకి 6, కాంగ్రెస్‌కు 1 రాగా, స్వతంత్రులు ఏడుగురు గెలిచారు. దీంతో ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ రాలేదు. ఎంఐఎంకు మరో రెండు సీట్లు అవసరం ఉంది. కాగా ఎంఐఎం కంచుకోటగా ఉన్న భైంసా మున్సిపాలిటీపై బీజేపీ కాషాయ జెండా ఎగురవేయాలని ప్రయత్నాలు చేస్తోంది.
స్వతంత్రులను కలుపుకొని ఆదిలాబాద్ ఎంపీ, ముథోల్ ఎమ్మెల్యే ఎక్స్ అఫీషియో ఓట్లను వినియోగించుకోని చైర్మన్ పీఠాన్ని కైవసం చేసుకోవాలని చూస్తోంది. గతంలో ఎంఐఎంను వీడి ఈ సారి పోటీ చేసి గెలిచిన ఇద్దరు ఇండిపెండెంట్లు చైర్మన్ ఎన్నికలో కీలకంగా మారారు. తమకు చైర్పర్సన్ పీఠం ఇచ్చే పార్టీలకే మద్దతు ఇస్తామని స్పష్టం చేస్తున్నారు. బీజేపీ ఆరుగురు కౌన్సిలర్లతో పాటు ఐదుగురు ఇండిపెండెంట్లను క్యాంపుకు తీసుకెళ్లారు. దీంతో చైర్పర్సన్ ఎన్నిక ఉత్కంఠగా మారింది.
చైర్పర్సన్ ఇస్తే ఏ పార్టీకైనా మద్దతిస్తాం
ఖానాపూర్ మున్సిపాలిటీలో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకున్న విషయం తెలిసిందే. 12 వార్డులున్న మున్సిపాలిటీలో బీజేపీ, బీఆర్ఎస్ చెరో 4 స్థానాలు సాధించగా.. మూడు చోట్ల గెలిచిన కాంగ్రెస్ఇండిపెండెంట్ మద్దతు దక్కించుకుంది. దీంతో మూడు పార్టీలు నలుగురు అభ్యర్థులతో సమానంగా ఉంది. దీంతో ఈ మూడు పార్టీలు చైర్పర్సన్ పదవి కోసం పోటీపడుతున్నాయి. ఏ పార్టీ దేనికి మద్దతిస్తుందోనని పుర ప్రజలు ఆసక్తిగా చూస్తున్నారు. కాగా కాంగ్రెస్ కు బీఆర్ఎస్ కానీ, బీజేపీ గానీ మద్దతిచ్చే అవకాశాలున్నాయని చర్చ జరుగుతోంది.
అభ్యర్థులంతా శిబిరాల్లో ఉండడంతో ఏమి జరుగుతుందో తెలియని పరిస్థితి.చైర్పర్సన్ పదవిని బీఆర్ఎస్ కు ఇస్తే తాము ఏ పార్టీతోనైనా కలిసి నడిచేందుకు సిద్ధంగా ఉన్నామని ఆ పార్టీ నియోజకవర్గ భూక జాన్సన్ నాయక్తెలిపారు. ప్రస్తుతం తటస్థంగా ఉన్నామని తెలిపారు.దీంతో ఏం జరగబోతోందా అని సర్వత్రా ఆసక్తి నెలకొంది.
కాగజ్ నగర్ లో ఉత్కంఠ
కాగజ్‌నగర్‌లోని 30 వార్డులకు మ్యాజిక్ ఫిగర్ 16 కావాల్సి ఉంది. బీఆర్ఎస్ 11, కాంగ్రెస్ కు 9 స్థానాలు రాగా బీజేపీకి 5, ఇండిపెండెంట్ లు నలుగురు, ఎంఐఎం నుంచి ఒకరు గెలిచారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య ప్రధాన పోటీ నెలకొంది. పీఠం కైవసం చేసుకునేందుకు ఎమ్మెల్సీ దండే విఠల్ తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే ఇద్దరు ఇండిపెండెంట్లను తమ వైపు తిప్పుకున్నారు. బీజేపీ సపోర్ట్ తీసుకునే అవకాశం ఉందని సమాచారం. బీఆర్ఎస్ నుంచి మాజీ ఎమ్మెల్యే కోనప్ప కూడా పకడ్బందీగా ప్రయత్నం చేస్తున్నారు. ఆయన కూడా ఇద్దరు ఇండిపెండెంట్ల మద్దతు తీసుకున్నట్లు తెలుస్తోంది.
